ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, కృత్రిమ అలజడి సృష్టించేందుకు వైసీపీ అధినేత జగన్ బెంగళూరు వేదికగా పక్కా స్కెచ్ వేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కుట్రలో రెండు టీవీ ఛానళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతల నోటి నుంచి వస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు విపరీతమైన కవరేజ్ ఇవ్వడం ద్వారా, ప్రత్యర్థి పార్టీల శ్రేణులను రెచ్చగొట్టడం.. ఆపై జరిగే ప్రతిఘటనను రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది అంటూ భూతద్దంలో చూపడం ఈ వ్యూహంలో భాగమని అనుమానిస్తున్నారు.
శాంతిభద్రతల సమస్యను సృష్టించడమే కాకుండా, ఒక ఛానల్ ఏకంగా వార్తలకు కుల రంగు పులిమి అత్యంత దారుణంగా వ్యవహరించిందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేలా ప్రసారాలు చేస్తూ, మంటలకు ఆజ్యం పోసే పనిని సదరు మీడియా సంస్థ భుజానికెత్తుకుంది. మరో ఛానల్ అయితే ఏకపక్షంగా వైసీపీ నేతల మాటలకే ప్రాధాన్యత ఇస్తూ, అసలు నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. బాధ్యతాయుతమైన మీడియాగా ఉండాల్సిన సంస్థలు, ఒక పార్టీకి టూల్స్ గా మారి బూతుల సంస్కృతిని ప్రోత్సహించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నాయి.
వార్తల పేరుతో కులపరమైన రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తున్న ఈ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మీడియా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కావాలనే అలజడి సృష్టిస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిలించేలా వార్తా కథనాలు అల్లిన సదరు జర్నలిస్టులు, సంస్థల యజమానులపై కూడా విచారణ జరిపి, ఈ బూతుల కుట్ర మూలాలను వెలికితీయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.