చిత్రసీమలో రూమర్లు మామూలే. అది కూడా ఓ భాగం అయిపోయాయి. ప్రేమ – పెళ్లికి సంబంధించిన గాసిప్పులైతే లెక్క లేకుండా వచ్చేస్తుంటాయి. కొన్నింటిపై తారలు స్పందిస్తుటారు. కొన్ని లైట్ తీసుకొంటారు. కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రశ్నల్ని ఎదుర్కోక తప్పదు. మీనాక్షి చౌదరికి కూడా ఇలాంటి ప్రశ్నే తరచూ పలకరిస్తుంటుంది. ఈమధ్య మీనాక్షిపై ఓ రూమర్ గట్టిగా చక్కర్లు కొడుతోంది. అక్కినేని హీరో సుశాంత్ తో.. మీనాక్షి ప్రేమలో పడిందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. మీనాక్షి తొలి సినిమా ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’. అందులో సుశాంత్ హీరో. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య బంధం బలపడిందన్నది రూమర్ల సారాంశం. వీటిపై ఇప్పుడు మీనాక్షి స్పందించింది.
”ఇలాంటి వార్తలు విని నవ్వుకొంటాను. అంతకు మించి ఏం చేయలేను. సుశాంత్ నాకు మంచి మిత్రుడు. మేం కలిసి నటించాం. అంతకు మించి మా మధ్య ఏం లేదు. చిత్రసీమలో ఇవన్నీ మామూలే. రోజుకో వార్త బయటకు వస్తుంటుంది. అవన్నీ నిజం కావని అందరికీ తెలుసు. నేను కూడా అన్నింటికీ అలవాటు పడుతున్నాను. మైండ్ లో ఎప్పుడూ స్ట్రెస్ తీసుకోను. అందుకే విని.. వదిలేస్తుంటాను..” అని చెప్పుకొచ్చింది. సో.. సుశాంత్ తో లవ్ స్టోరీ ఎపిసోడ్ కు మీనాక్షి పుల్ స్టాప్ పెట్టినట్టే. తను కథానాయికగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. గత పండక్కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్టు కొట్టింది మీనాక్షి. ఈసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని గట్టిగా నమ్ముతోంది.
