చిరు అంటే గ్రేసు.. గ్రేసు అంటే బాసు. ఈ విషయంలో తిరుగులేదు. ఇన్నేళ్ల వయసులోనూ దాన్ని చెక్కు చెదరనివ్వలేదు చిరు. సంక్రాంతికి రాబోతున్న ‘మన శివ శంకర ప్రసాద్ గారు’ లోనూ ఈ గ్రేస్ గ్యారెంటీగా చూడబోతున్నారంటూ హింట్ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. ఈ రోజు దసరా సందర్భంగా ‘మీసాల పిల్ల’ అనే పాట ప్రోమో విడుదల చేశారు. చిన్న గ్లింప్స్‌లోనే తన గ్రేస్ తో అదరగొట్టేశారు మెగాస్టార్. ఈ చిన్న బిట్ కే… ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చిరు – నయరతార కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరినట్టు అర్థమవుతోంది. చాలా కాలం తరవాత ఉదిత్ నారాయణ్‌ని తీసుకొచ్చి పాట పాడించడంతో.. ఎక్ట్సా కిక్ వచ్చినట్టైంది. అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ఇలాంటి మ్యాజిక్కే చేశాడు. అందరూ మర్చిపోయిన రమణ గోగులను మళ్లీ గుర్తు చేశాడు. ఆ పాట సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఉదిత్ నారాయణ్ ని రంగంలోకి దింపాడు.
భీమ్స్ కు ఇది మంచి అవకాశం. చిరంజీవిలాంటి స్టార్ హీరో తో హిట్ కొడితే – తన కెరీర్ స్టాండర్డ్ గా నిలబడిపోతుంది. అందుకే భీమ్స్ కూడా శ్రద్ద పెట్టి ట్యూన్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఆల్బమ్ లో రమణ గోగుల కూడా ఓ పాట పాడారు. చిరంజీవికి రమణగోగుల గాత్రం అందించడం ఇదే తొలిసారి. ఆ పాట కూడా ఫ్యాన్స్ ని అలరించేలా ఉండబోతోందని తెలుస్తోంది. సంక్రాంతి రేసులో ఉన్న చిరంజీవి సినిమాకు ఇది మంచి ఆరంభం. పూర్తి పాటతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయినట్టే అనుకోవాలి.