పవన్ కల్యాణ్‌కీ ఇతర మెగా హీరోలకు మధ్య అవినాభావ సంబంధం ఉందా? అని అడిగితే సూటిగా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి మెగా ఫ్యాన్స్‌ది. మెగా ఆడియో ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ హాజరైతే అదో అద్భుతమే అన్నట్టు తయారైంది వాళ్ల మధ్య బంధం. అలాగని పవన్ కల్యాణ్ ఆడియో ఫంక్షన్లకు దూరమా?? అని అడిగితే అదీ లేదు. తనంటే ప్రాణం పెట్టే నితిన్ దగ్గర్నుంచి.. సప్తగిరి వరకూ ఎవరి పిలిచినా కాదనకుండా వెళ్తాడు. కావల్సినంత ప్రమోషన్‌కి చోటిస్తాడు. అలాంటిది మెగా హీరోల ఫంక్షన్లకు పవన్ ఎందుకు వెళ్లడూ? అని అడిగితే దానికి మెగా ఫ్యాన్స్ దగ్గర సరైన సమాధానం లేదు.
ప్రస్తుతానికి వద్దాం. ఈ రోజు నితిన్ సినిమా ఒకటి మొదలైంది. ప్రొడ్యూసర్ వాళ్లో వీళ్లో వేరొకరో అయ్యుంటే ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకొనేవారు కాదెవరూ. కానీ పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ పతాకంపై స్టార్ట్ అయిన సినిమా ఇది. దానికి త్రివిక్రమ్ కూడా జత కలిశాడు. దాంతో కొబ్బరికాయ్ కొట్టగానే క్రేజ్ మొదలైంది. ఈ సంబరం ఇక్కడితో ఆగలేదు. నితిన్‌తో సినిమా చేస్తున్న పవన్… అన్నయ్య కొడుకు రామ్‌చరణ్‌తో ఎప్పుడు చేస్తాడు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. నితిన్ తో చేసినంత మాత్రాన చరణ్‌తోనూ పవన్ ఓ సినిమా చేయాలన్న రూల్ లేదు. కానీ.. చరణ్ కథానాయకుడిగా పవన్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోందని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. పవన్, చరణ్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకొన్నారు కూడా. అయితే.. పవన్ – చరణ్ కాంబో ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. సడన్‌గా నితిన్ సినిమా మొదలయ్యేసరికి చరణ్ సినిమా మాటేంటి? అంటూ మెగా ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
చరణ్ అంటే పవన్‌కి ప్రత్యేకమైన అభిమానం. చరణ్ కూడా పవన్ అంటే తెగ ఇదైపోతుంటాడు. పవన్ సిద్దాంతాలకూ చరణ్ బాగా ఆకర్షితుడయ్యాడని మెగా కాంపౌండ్ వర్గాలే చెబుతుంటాయి. అంత రాపో ఉండి కూడా… చరణ్ సినిమా గురించి పవన్ ఏనాడూ ఆలోచించలేకపోయాడు. అదే సమయంలో… అసలు ఏమాత్రం చడీ చప్పుడు లేకుండా నితిన్ సినిమా మొదలెట్టేశారు. ‘ఎంతైనా.. నితిన్ అంటే పవన్‌కి మహా ఇది’ అనుకోవడం తప్ప… మెగా ఫ్యాన్స్ ఏమీ చెప్పలేని పరిస్థితి. మరోవైపు పవన్ పెట్టుబడేం లేదని.. అంతా నితిన్ డబ్బే అని.. కేవలం క్రేజ్ కోసం పవన్, త్రివిక్రమ్‌ల పేర్లు వాడుకొంటున్నాడని మరో వర్గం చెబుతోంది. ఏదేమైనా తనకు తనవాళ్ల కంటే.. తనని అభిమానించే వాళ్లే ఎక్కువని పవన్ మరోసారి నిరూపించాడు. మెగా అభిమానులకు ఇది మింగుడు పడని వ్యవహారమే.