ఈ యేడాది మెగా హిట్ తో బాక్సాఫీస్ బోణీ కొట్టింది. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో ఈ సంక్రాంతికి పలకరించారు. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది. భోళా శంకర్, గాడ్ ఫాదర్ చిత్రాలు చిరు అభిమానుల్ని బాగా నిరాశ పరిచాయి. 2025లోనే రావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చారు. అందుకే అభిమానులు కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ… సంతోష పడుతున్నారు. చిరుకే కాదు.. మిగిలిన మెగా హీరోలకూ ఈ యేడాది కీలకంగా మారింది.
రామ్ చరణ్ గతేడాది ‘గేమ్ ఛేంజర్’ని రంగంలోకి దింపారు. అయితే ఆ సినిమా అస్సలు వర్కవుట్ కాలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి పాన్ ఇండియా హిట్ తరవాత చరణ్ ఇలాంటి సినిమా చేయడం ఏమిటని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ల ఆశలన్నీ ఇప్పుడు ‘పెద్ది’పైనే ఉన్నాయి. ఈ యేడాది విడుదల కాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో అదొకటి. మార్చి 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. బుచ్చిబాబు ఈసారి కూడా మ్యాజిక్ చేస్తాడని ఫ్యాన్స్ అంతా గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి’ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. మ్యూజికల్ పరంగానూ ‘పెద్ది’ ఆశలు రేకెత్తిస్తోంది. బాక్సాఫీసు దగ్గర ఏమాత్రం ఈ సినిమా నిలబడినా కలక్షన్ల వర్షం కురిపించుకోవడం ఖాయం.
వరుణ్ తేజ్‌కు కొంత కాలంగా ఏదీ కలసి రావడం లేదు. కొత్త తరహా కథలు, మాస్ చిత్రాలూ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈనేపథ్యంలో వరుణ్ ట్రాక్ ఎక్కడానికి చాలా కష్టపడాల్సివస్తోంది. తన నుంచి ఈ యేడాది ‘కొరియన్ కనకరాజు’ వస్తోంది. హారర్ నేపథ్యంలో సాగే కథ ఇది. వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ చూశాక ఈ ప్రాజెక్ట్ పై కాస్త ఆశ కలిగింది. మేర్లపాక గాంధీ ప్రతిభావంతుడైన దర్శకుడే. ఈసారి తన మ్యాజిక్ ఫలించే అవకాశాలు ఉన్నాయి.
సాయిధరమ్ తేజ్ కూడా ట్రాక్ లోకి రావడానికి గట్టిగా కష్టపడుతున్నాడు. 2025లో తన నుంచి సినిమా రాలేదు. 2024లో ‘విరూపాక్ష’ పెద్ద హిట్. ఆ తరవాత వచ్చిన ‘బ్రో’ ఆశించిన మేర ఆడలేదు. యాక్సిడెంట్ కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు ‘సంబరాల ఏటిగట్టు’ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆర్థిక పరమైన కారణాలతో మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగించుకొని మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాపై నిర్మాత భారీగా ఖర్చు పెడుతున్నారు. పెట్టుబడి తిరిగి రావాలంటే.. తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలి. దాని కోసమే చిత్రబృందం కష్టపడుతోంది. వైష్ణవ్ తేజ్ సినిమా పట్టాలెక్కి చాలా కాలం అయ్యింది. వరుస ఫ్లాపుల తరవాత కథల ఎంపికలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు వైష్ణవ్. ఎట్టకేలకు ఓ కథ ఒప్పుకొన్నట్టు టాక్. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి. మొత్తానికి ఈ యేడాది మెగా హీరోలకు చాలా కీలకం. వాళ్లంతా మెగాస్టార్ బాటలోనే హిట్టు కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కాలని మెగా ఫ్యాన్స్ తో పాటుగా చిత్రసీమ కూడా బలంగా కోరుకొంటోంది.
