ఒకరు మెగాస్టార్.. ఇంకొకరు విక్టరీ స్టార్. ఇద్దరూ దశాబ్దాలుగా అభిమానుల్ని అలరిస్తున్నవాళ్లే. కొత్తతరాన్ని దాటుకొని, ధీటుగా నిలబడి, తమదైన మార్క్ వేసినవాళ్లే. ఇద్దరి మధ్యా మంచి బాండింగ్ ఉంది. కలసి కలిసి మాత్రం ఒకే ఫ్రేములో కనిపించలేదు. ఇప్పటికి.. ఇన్నాళ్లకు ఆ కల.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో తీరబోతోంది. చిరు, వెంకీ కలిసి ఈ సినిమాలో నటించారు. ఇద్దరూ ఆడారు.. పాడారు. ఆ సందడి చూడాలంటే సంక్రాంతి వరకూ ఆగాలి. కాకపోతే ఆ పాటలో చిరు, వెంకీల మధ్య కుదిరిన కెమిస్ట్రీ, వాళ్లు వేసిన మాసీ స్టెప్పులు చూడ్డానికి అంత కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ పాట బయటకు వచ్చేసింది.
”ఏందీ బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి” అని వెంకీ…
”ఏందీ వెంకీ సంగతి… ఇరగదీద్దాం సంక్రాంతి..” అంటూ చిరు.. ఇద్దరూ కలిసి బీభత్సమే చేసేశారు. పాటలో, బీటులో, రాతలో, తీతలో.. సంక్రాంతి వైబ్ కొట్టొచ్చినట్టు కనిపించింది. సంక్రాంతి వచ్చి వెళ్లేంత వరకూ ఈ పాట.. ఈ సౌండ్.. మార్మోగడం ఖాయం. ప్రీ క్లైమాక్స్ లో ఈ పాటని డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ ఊపుతోనే అభిమానులు థియేటర్ల నుంచి బయటకు వస్తారు. భీమ్స్ అందించిన ట్యూన్ క్యాచీగా ఉంది. ఒక్కసారి వింటే పట్టేస్తుంది. కాశర్ల శ్యామ్.. చిరు – వెంకీల బాండిగ్, ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ పాట రాసినట్టు కనిపిస్తోంది. పబ్ వైబ్స్ ఉన్న పాట ఇది. అందుకే డీజే కూడా మిక్స్ చేశారు. ఈ డిసెంబరు 31 పార్టీల్లో ఆడి, పాడడానికి అనువైన ఓ మ్యూజిక్ బీట్ ఈ పాటతో అందినట్టు అనిపించింది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
