అమరావతి నిర్మాణ పనుల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థ అలసత్వం వహిస్తోందని, ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన అంశాలనే ఆధారంగా చూపిస్తూ ఓ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో కథనాన్ని ప్రసారం చేసింది. అయితే, ఈ ఆరోపణల్లో వాస్తవాల కంటే తమ ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలే ఎక్కువగా ఉన్నాయంటూ మేఘా సంస్థ ఏకంగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపడం వివాదాస్పదమైంది.
ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న విషయాలనే మీడియా ప్రస్తావించినప్పుడు, ఆ సంస్థ నిజానిజాలను ప్రజల ముందు ఉంచాల్సింది పోయి, ఇలా చట్టపరమైన చర్యల పేరుతో నోటీసులు ఇవ్వడం గొంతు నొక్కే ప్రయత్నమేనని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసింది. గతంలోనూ పలు ప్రాజెక్టుల విషయంలో మేఘా సంస్థపై విమర్శలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తాజా నోటీసుల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు సంస్థ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి బెదిరింపు ధోరణిని అవలంబిస్తోందని, ఇది ప్రజాస్వామ్యబద్ధమైన విమర్శలను అడ్డుకోవడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడం, వందల కోట్ల దావాలు వేయడం వల్ల సంస్థపై సానుభూతి పెరగడం పక్కన పెడితే, మరింత ప్రతికూల ప్రచారం జరుగుతోంది.
ఒక భారీ నిర్మాణ సంస్థగా మేఘా ఇంజినీరింగ్ తనపై వచ్చిన ఆరోపణలను సాంకేతికంగా, ఆధారాలతో సహా తిప్పికొట్టాల్సింది. అమరావతి వంటి కీలక ప్రాజెక్టులో తాము చేపట్టిన పనులు ఎలా సాగుతున్నాయో ప్రజలకు వివరించి ఉంటే సంస్థ ప్రతిష్ట పెరిగేది. అలా కాకుండా, మీడియా సంస్థలను ,సోషల్ మీడియా గొంతుకలను చట్టపరమైన చిక్కులతో భయపెట్టాలని చూడటం వల్ల ఆ సంస్థకే నష్టం చేకూరుస్తుంది. ఈ రకమైన ధోరణి సోషల్ మీడియాలో మేఘా వ్యతిరేకతను ఇంకా బలపరుస్తుందని, ఇది దీర్ఘకాలంలో సంస్థ బ్రాండ్ ఇమేజ్‌కు గొడ్డలిపెట్టుగా మారుతుందని అనుకోవచ్చు.


