మెట్ గాలా 2026 వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ సుధా రెడ్డి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. న్యూయార్క్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వేడుకలో ఆమె ధరించిన నెక్లెస్ విలువ అక్షరాలా 142 కోట్ల రూపాయలు అంటే 15 మిలియన్ డాలర్లు కావడం ఇప్పుడు గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
రూ. 142 కోట్ల క్వీన్ ఆఫ్ మెరెలాని
సుధా రెడ్డి ధరించిన ఈ నెక్లెస్‌లో ప్రధాన ఆకర్షణ 550 క్యారెట్ల అరుదైన టాంజానైట్ రత్నం. దీనిని క్వీన్ ఆఫ్ మెరెలాని అని పిలుస్తారు. టాంజానియాలోని మెరెలాని కొండల్లో లభించే ఈ అరుదైన వైలెట్-బ్లూ రంగు రత్నాన్ని విక్టోరియన్ శైలిలో డైమండ్లతో పొదిగి ఈ నెక్లెస్‌ను రూపొందించారు. కేవలం ఈ నెక్లెస్ మాత్రమే కాకుండా, ఆమె 40 క్యారెట్ల ఎమరాల్డ్ రింగ్, 30 క్యారెట్ల పోల్కీ డైమండ్ రింగ్‌ను కూడా ధరించారు. ఇవన్నీ ఆమె సొంత కలెక్షన్ లోనివే!
దుస్తులు కూడా చాలా ఖరీదైనవే
ఆమె ధరించిన దుస్తులు కూడా అంతే ప్రత్యేకంగా నిలిచాయి. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ గౌనుకు ట్రీ ఆఫ్ లైఫ్ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన సుమారు 3,000 ఏళ్ల నాటి కలంకారి కళను ఈ దుస్తుల్లో ప్రతిబింబించారు. రాయల్ బ్లూ కలర్ వెల్వెట్‌తో తయారైన ఈ దుస్తులపై జర్దోజీ, రేషం ఎంబ్రాయిడరీతో పాటు కల్పవృక్షం, పాలపిట్ట, జమ్మిచెట్టు, తంగేడు పువ్వులు, సూర్యచంద్రుల ఆకృతులను అద్భుతంగా తీర్చిదిద్దారు.
3,459 గంటల శ్రమ.. 90 మంది కళాకారులు
ఈ అద్భుతమైన డ్రెస్ తయారీ వెనుక భారీ శ్రమ దాగి ఉంది. సుమారు 90 మంది నిపుణులైన కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి 3,459 గంటల్లో ఈ గౌనును సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ స్టైలిస్ట్ మారియల్ హెన్ పర్యవేక్షణలో సుధా రెడ్డి ఈ లుక్ లో మెరిశారు. మెట్ గాలాలో సుధా రెడ్డికి ఇది మూడవసారి.


