జూబ్లిహిల్స్ గెలుపు తర్వాత కాంగ్రెస్ వ్యూహాలు మారిపోతున్నాయి. ఇప్పటి వరకూ డిఫెన్స్ గేమ్ ఆడుతోంది కానీ ఇక నుంచి ఎదురుదాడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో .. రేవంత్ దూకుడుగా ముందుకెళ్లబోతున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం అవసరమైన మరో పధ్నాలుగు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అంతర్గతంగా సన్నాహాలు ప్రారంభించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ భవిష్యత్ పై ఎమ్మెల్యేల్లో ఆందోళన
బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ పై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఏ విధంగా చూసినా పార్టీకి మనుగడ ఉందని అనుకోవడం లేదు. పార్లమెంట్ సీట్లలో సగం చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. రెండు ఎమ్మెల్యే సిట్టింగ్ సీట్లను కోల్పోయారు . ఆ రెండూ గ్రేటర్ పరిధిలోనివే. చాలా చోట్ల క్యాడర్ బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. సోషల్ మీడియాలో హైప్ ఎక్కించుకుని అదే నిజమని నమ్ముకునే నాయకత్వం ఉండటంతో .. పార్టీ ఎమ్మెల్యేలకు దిక్కుతోచడం లేదు.
పనులు కాక ఉక్కిరిబిక్కిరవుతున్న ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ లో కీలకంగా ఉండే ఎమ్మెల్యేలు చాలా మంది పనులు కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజల కోసం చిన్న పని చేయలేకపోతున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది గతంలోనే కాంగ్రెస్ నాయకత్వానికి టచ్ లోకివచ్చారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాంటివారు రేవంత్ రెడ్డి పిలవాలే కానీ రెడీ అన్న సంకేతాలు ఎప్పుడో ఇచ్చారు. కానీ ఎందుకో ఆయనను పిలవలేదు. ఇప్పుడు అలాంటి వారందర్నీ లాగేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేసీఆర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారా ?
బీఆర్ఎస్ నాయకులు.. తమ పార్టీ భవిష్యత్ పై ఆందోళన చెందడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది కేసీఆర్ నిస్సహాయత. అనారోగ్యం కారణంగా ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవచ్చని అంటున్నారు. కేసీఆర్ హెల్త్ పై క్యాడర్ కు సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇలాంటి ప్రచారం జరుగుతోంది. దీన్ని కేటీఆర్ ఆపలేకపోతున్నారు. బీజేపీతో పొత్తు తప్పదని .. లేకపోతే విలీనం ఖాయమని జరుగుతున్న ప్రచారాన్నీ గట్టిగా ఖండించలేకపోతున్నారు. అదే సమయంలో హరీష్ రావు అతి పెద్ద ఫ్యాక్టర్ గా ఉన్నారు. ఆయనకు పొగ పెడుతున్నారని..ఈటల తరహాలో ఆయననూ బయటకు పంపుతారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అదే జరిగితే ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు.
ఇవన్నీ కారణాలుగా త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాలంటున్నాయి. జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇప్పటి వరకూఉన్న పరిస్థితుల్ని బట్టి అంచనా వేయవచ్చు.
