రివ్యూ: మెంటల్ మదిలో

తెలుగు360.కామ్ రేటింగ్ : 3.25/5
కొన్ని సినిమాలంతే.
2 గంటల సినిమా ఓపిగ్గా… ప్రేమగా… ఇష్టంగా చూసొచ్చాక
కథ అడిగితే చెప్పలేం. అందులో ఏముందని ప్రశ్నిస్తే.. వర్ణించడానికి మాటలు రావు. కానీ థియేటర్ నుంచి
అనుభూతుల పొట్లం చేతికిచ్చి బయటికి పంపుతాయి.
జ్ఞాపకాలు జేబులో వేసి… ఇంటికెళ్లి లెక్కపెట్టుకోమంటాయి.
మన జీవితాన్ని మనకే అద్దంలో చూపిస్తాయి.
ఆ రెండు గంటలు… ఓ అనుభవం, జ్ఞాపకం, మన జీవితం లో ఓ భాగం. అలాంటి గిలిగింత… ‘మెంటల్ మది’లో చూసినప్పుడు కూడా కలుగుతుంది. గొప్ప కథ కాదు, అద్భుత కథనం లేదు, ఊహకందని ట్విస్టులు లేవు.. కానీ ఏదో ఉంది… అదేంటి?? ఎలా ఉంది??

* కథ

అరవింద్ కృష్ణ అదో టైపు. చిన్నప్పటి నుంచి ఒకటే కన్ఫ్యూజన్. రెండు షర్ట్స్ ఎదురుగా ఉంటే… ఏది కావాలో తేల్చుకోలేడు. ఆప్షన్స్ ఎక్కువైతే… ఈ గందరగోళం మరింత ఎక్కువ అవుతుంది. అమ్మాయిలంటే సిగ్గు. ఎన్ని పెళ్ళిచూపులకు వెళ్లొచ్చినా ఒక్కటీ సెట్ అవ్వదు. చివరికి స్వేచ్ఛ అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. స్వేచ్ఛ ఈ తరం అమ్మాయి. తనకు ఏది కావాలో స్పష్టం గా తెలుసు. తన మాటలతో అరవింద్ లో మార్పు తీసుకొస్తుంది. మరికొద్ది రోజుల్లో నిర్చితార్ధం అనగా ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అరవింద్ కి మరో అమ్మాయి పరిచయం అవుతుంది. తనకి కూడా అరవింద్ దగ్గరవుతాడు. దాంతో అరవింద్ లో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది తేల్చుకోలేడు. ఈ దశలో అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?? తన కన్ఫ్యూజన్ వల్ల ఎవరికి దూరమయ్యాడు?? ఎవరికి దగ్గరయ్యాడు?? అనేదే ఈ ‘మెంటల్ మదిలో’ కథ.

* విశ్లేషణ

ఓ మంచి సినిమా తీయడానికి కథ అవసరం లేదు… మంచి క్యారెక్టరేజేషన్ చాలు… అని నమ్మి, సినిమాలు తీస్తున్న జమానా ఇది. అయితే అటు కథా లేక, ఇటు పాత్రల్ని సరిగా మలచుకోక సినిమాల్ని నట్టేట ముంచేస్తున్నారు. వివేక్ ఆత్రేయ మాత్రం అలా చేయలేదు. పాత్రలకు తన సన్నివేశాలతో ప్రాణ ప్రతిష్ట చేసాడు. విష్ణు పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆశ్చర్య పరుస్తుంది. ఇంత చిన్న కాంప్లికేషన్ తోనూ కథ నడపొచ్చా అనిపిస్తుంది. స్వేచ్ఛ పాత్రతో ప్రేమలో పడిపోతాడు ప్రేక్షకుడు. అది ఎంతగా అంటే… అరవింద్ – స్వేచ్ఛ మధ్య మరో అమ్మాయి వస్తే… “ఛ.. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టొరీ ఎందుకు?? కొంపదీసి స్వేచ్ఛ ని అరవింద్ వదిలేస్తాడా” అనే బెంగ వేస్తుంది. అంతలా ఆ పాత్రల్ని ప్రేమించేస్తాం.

అరవింద్ స్వభావాన్ని పరిచయం చేయడానికి, కథలోకి హీరోయిన్ ని తీసుకురావడానికి పెద్దగా సమయం తీసుకోలేదు దర్శకుడు. ప్రారంభ సన్నివేశాలు అద్భుతః అనిపించేలా ఉండవు గానీ, వేసవిలో ఓ చిరుగాలి హాయిగా తాకుతూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అరవింద్- స్వేచ్చ మధ్య నడిపించిన కథ మరీ అంత రొమాంటిక్ గా ఉండవు గానీ, పెళ్లికి ముందు స్వీట్ నథింగ్స్ ఇంత స్వీటుగా ఉంటుందా అనిపిస్తుంది.

మరో కథానాయిక రాగానే, కాస్త జర్క్ వస్తుంది. అది సహజం కూడా. కానీ క్రమంగా ఆ పాత్రని ప్రేమించేస్తాం. ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలి అనే కన్ఫ్యూజన్ అరవింద్ కే కాదు, చూసే ప్రేక్షకుడికీ కలుగుతుంది. పతాక సన్నివేశాలు సరదాగా సహజంగా సాగడం, శివాజీ రాజా పాత్ర, తన డైలాగులు పడడం తో… ఈ కథకు సరైన ముగింపు ఇచ్చినట్టయ్యింది. మొత్తానికి గుంతలు లేని రోడ్డులో.. ఓ సాయంత్రం, నచ్చిన వ్యక్తితో సరదాగా చేసిన ప్రయాణం లా అనిపిస్తుంది… మెంటల్ మదిలో.

* నటీనటులు

విష్ణు మంచి నటుడు. ఆ విషయం ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. అండర్ ప్లే చేయడం అంత సులభం కాదు. ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. కానీ విష్ణు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కధానాయికలిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలో తెలియక కన్ఫ్యూజన్ మొదలవుతుంది. నివేత పేతురాజ్ సహజంగా నడిచింది. అందంగా ఉంది. రేణు గా కనిపించిన అమ్మాయి విద్యా బాలన్ రూపు రేఖలతో ఆకట్టుకుంది. విద్యాబాలన్ కి ఏ మాత్రం తీసిపోకుండా నటించింది. శివాజీ రాజా నటన ఆకట్టుకుంది. చాలా కాలం తరువాత మంచి పాత్ర పడింది.

* సాంకేతికత

ఇది దర్శకుడి సినిమా. 22 ఏళ్ల కుర్రాడు… జీవితాన్ని, అందులో ఉన్న చిన్న కన్ఫ్యూజన్ నీ పట్టుకుని ఇలాంటి సినిమా ఎలా తీశాడా అనే ఆశ్చర్యం కలుగుతుంది. రాబోతున్న నవతరం దర్శకులకి వివేక్ తప్పకుండా స్ఫూర్తి నింపుతాడు. నేపధ్య సంగీతం కూడా స్వచ్చం గా వినిపించింది. కధ ముంబాయి కి మారాక, నార్త్ మూడ్ కి తగ్గట్టు సంగీతం వినిపించింది. దానికి తోడు ఓ హిందీ పాట కూడా. దర్శకుడు ఎంత కీన్ గా ఆలోచించాడు అనడానికి అదో ఉదాహరణ. మాటలు బాగున్నాయి. ఆకట్టుకున్నాయి.

* తీర్పు

స్వచ్ఛమైన కథలు, అందమైన ప్రయాణాలు, మధురమైన స్మృతులు… మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటాం. అలాంటి అందమైన అనుభూతి… ఈ సినిమా. పెళ్లి చూపులు తో చిన్న సినిమా గాలి మళ్లింది. కొత్త తరహా కథలు వస్తున్నాయి. ఈ సినిమాతో.. ఆ మార్పు మరింత ఉదృతం అవుతుంది.

* ఫైనల్ టచ్: మదిలో… ఎంత హాయో…

తెలుగు360.కామ్ రేటింగ్ : 3.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.