Meter Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ : 1/5
కిరణ్ అబ్బవరంకు మొదటి నుంచి మాస్ ఇమేజ్ పై ద్రుష్టి వుంది. రెండో సినిమా నుంచే కుదిరిన ప్రతి చోటా మాస్ ఎలివేషన్లు. ఫైట్లు, యాక్షన్ సీన్లు చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఏకంగా మాస్ ‘మీటర్’ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ టీజర్ లోనే ఇది పక్కా కమర్షియల్ మాస్ మసాలా సినిమాని అర్ధమైయింది. మరీ మాస్ మీటర్ లో మేటర్ ఏంటి ? కిరణ్ కోరుకునే మాస్ విజయం దక్కిందా ?
అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల కానిస్టేబుల్. అర్జున్ ని ఎస్సై గా చూడాలనేది తండ్రి కోరిక. అయితే అర్జున్ కి అసలు పోలీసు ఉద్యోగమే ఇష్టం వుండదు. కారణం తన తండ్రికి జరిగిన అవమానాలతో పాటు డిపార్ట్మెంట్ అంటే వ్యక్తిగత జీవితం వుండదని చిన్నప్పటి నుంచి అతడిపై ముద్రపడిపోతుంది. అయితే తన తండ్రి కోసం ఎస్సై కావాలని ప్రయత్నాలు చేస్తునట్లుగా నటిస్తుంటాడు. అయితే అనుకోకుండా అర్జున్ కి ఎస్సై ఉద్యోగం వచ్చేస్తుంది. అయితే ఇష్టం లేని ఉద్యోగం నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి హోంమంత్రి కంఠం బైర్రెడ్డి (ధనుష్ పవన్) సాయంతో తన ఉద్యోగం పోగొట్టుకోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు అర్జున్. ఏమిటా ఒప్పందం ? అసలు బైర్రెడ్డి ఎలాంటి వాడు ? తన తండ్రి ద్వారా అర్జున్ ఎలాంటి నిజాన్ని తెలుసుకున్నాడు ? అర్జున్ మళ్ళీ ఉద్యోగం లో చేరాడా లేదా ? అనేది మిగతా కథ
కొన్ని సినిమాలు చూస్తున్నపుడు ‘కమర్షియల్ సినిమా’ని చాలా మంది దర్శకులు తప్పుగా అర్ధం చేసుకుంటారని అనిపిస్తుంది. కొత్త దర్శకుడు రమేష్ ‘మీటర్’ ని తీసిన విధానం చూసినప్పుడు కూడా అదే అనిపించింది. నాలుగు పాటలు, మూడు ఫైట్లుకు లవ్, కామెడీ ట్రాక్ ఇరికించేసి.. ఎదో ఒక ఎమోషన్ పెట్టేస్తే ‘కమర్షియల్’ సినిమా అయిపోతుందనే భ్రమ దర్శకుడు రమేష్ లో కనిపించింది. ప్రారంభం నుంచి చివరి దాక ఎక్కడా కొత్తదనం లేకుండా కిలో మీటర్ ముందే ఊహించే సన్నివేశాలు పేర్చుకుంటూ సహనానికి పరీక్షపెట్టె ‘మీటర్’ని ప్రేక్షకుల మీదకు వదిలాడు.
ఫాదర్ సెంటిమెంట్ తో కథ మొదలౌతుంది. పోలీసు ఉద్యోగం వద్దనడానికి హీరోగా దగ్గర పెద్ద కారణాలు వుండవు. కానీ వద్దు అని బలంగా ఫిక్స్ అయిపోతాడు. తర్వాత వెంకీ సినిమాలో ఎబీసి డీలు రాసే ఉద్యోగాలు వచ్చేసినట్లు.. ఇందులో ఓఏంఆర్ సీట్ మీద హీరోయిన్ బొమ్మ చుక్కలుగా పెడితే ఉద్యోగం వచేస్తుంది. (తర్వాత రాంగ్ అపాయింట్ మెంట్ అని తేలుతుందనుకోండి. అదొక గొడవ). ఇందులో సన్నివేశాలని ఎంత సిల్లీగా పేర్చుకుంటూ పోయారంటే.. సరదాగా పాట పాడుతూ హీరో, ఓ ఉగ్రవాద ముఠాని పట్టించేస్తాడు. తన ప్రమేయం లేకుండానే డ్రగ్స్ కేసులు చేధించేస్తాడు.. ఇదంతా తెరపై చూస్తుంటే.. కమర్షియల్ సినిమా అంటే ఇంత నవ్వులాటగా చేసేయాలా ? అనిపిస్తుంది.
ఇందులో ప్రధాన పాత్రలన్నీ చాలా కుత్రిమంగా వుంటాయి. ఓపెనింగ్ సీన్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రూమ్ లో వేసి ఫుట్ బాల్ ఆడుతుంటాడు హోం మినిస్టర్. ఈ సీన్ ఎందుకంటే విలన్ గారైన హోం మినిస్టర్ గారు ఇంత పవర్ ఫుల్ అని చెప్పడానికి. పోనీ ఇది దర్శకుడి స్వేఛ్చ అనుకుందాం. మరి అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ ని చివర్లో ఒక బపూన్ ని చేసినట్లు ఆడుకుంటాడు హీరో. అసలు ఒక ఎస్సై కి ఎలాంటి అధికారాలు వుంటాయి ? ఒక రాష్ట్రానికి చెందిన హోం మినిస్టర్ తో అంత సింపుల్ గా ఒక ఎస్సై ఎలా ఆడుకుంటాడు.. ?
బాలకృష్ణ, చిరంజీవి లాంటి మాస్ మూలవిరాట్ లు కూడా పోలీసు పాత్రలు చేశారు. ఎదో ఒక స్టేషన్ పరిధిలో వున్న ఒక రౌడీతోనో, రాజకీయ నాయకుడితోనో తలపడ్డారు కానీ.. ఇలా హోం మినిస్టర్ ని బఫూన్ చేసే పాత్రలు చేయలేదు. ఇంత సిల్లీ పాత్రలు తెరపై చూస్తున్నప్పుడు..ఎంత కమర్షియల్ అని ముద్ర వేసి వదిలినా సినిమా చూడాలంటే ఆలోచన శక్తి ఇంట్లో మర్చిపోయి రావాలా ? అని ప్రశ్నించుకునే పరిస్థితి.
ఫాదర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు. అటు విలన్ హీరోల మధ్య వార్ కూడా రక్తికట్టలేదు. లవ్ ట్రాక్ అయితే మరీ పేలవంగా వుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు లాజిక్ వందకిలో మీటర్ల్ దూరంలో వున్నాయి. నేరాన్ని నిరూపించడాని హీరో ఆశ్రయించిన ఆర్టీఐ ఎపిసోడ్ ని చూసి థియేటర్ లో జనం గల్లున నవ్వారంటే అర్ధం చేసుకోవచ్చు అది ఎంత వీక్ గా తెరపైకి వచ్చిందో.
ఇక చివర్లో విలన్ ని బఫూన్ చేసిన ఎపిసోడ్ అయితే ముందు అయోమయంగా వుంటుంది. తర్వాత కాసేపటికి ఓటింగ్, రాజకీయాలపై దర్శకుడికి వున్న అజ్ఞానం చూసి జాలిపడుతుంది. సెల్ ఫోన్ లో ఒక యాప్ చూపించి హీరో మోసం చేశాడనే అనుకుందాం. ఆ సెల్ ఫోన్ లో వున్న టెక్నాలజీ ఈవీఏం మిషన్ లోకి ఎలా వస్తుంది? అనే కనీస ఆలోచన లేని హోంమంత్రి చూసిన తర్వాత ఇదంతా ఒక ‘బఫూన్ మీటర్’ అని ఓ నిట్టూర్పు వదిలేయడం ప్రేక్షకుడి వంతౌతుంది.
కిరణ్ అబ్బవరంకు ఒక స్టయిల్ వుంది. కొన్ని కథలు ఆ స్టయిల్ వర్క్ అవుట్ అవుతుంది కానీ ఇలాంటి కథలకు అస్సల్ నప్పదు. చాలా సమయంలో అసలు తను క్యారెక్టర్ లోనే లేడు. చాలా చోట్ల కిరణే కనిపిస్తాడు. ఆ పాత్ర మోయడానికి కిరణ్ బలం సరిపోలేదనే చెప్పాలి. పోలీసు డ్యూటీలో వుండి కూడా ‘కుర్ర నాకొడుకులం’ అని కిరణ్ పలుకుతుంటే.. ఈ పాత్రలో తన యాక్టింగ్ మీటర్ రాంగ్ స్కేల్ లో వెళ్ళిపోయిందనిపిస్తుంది. అత్యుల్య రవి అందంగా వుంది కానీ ఆమెకి ఇచ్చిన సీన్లే అసహజంగా అనిపిస్తాయి. చర్చిలో చేసిన కామెడీ, యాసిడ్ పోసిన ఎపిసోడ్ ఓవర్ యాక్షనే. తండ్రి పాత్ర చేసిన నటుడు ఆకట్టుకుంటాడు. పాపం చాలా సిన్సియర్ గా చేశాడు కానీ కథలో ఎమోషన్ లేదు. హోం మినిస్టర్ పాత్ర లో చేసిన పవన్ ఆకట్టుకుంటాడు. చివరి సీన్లు అతని కామెడీ విలన్ చేశారు కానీ మిగతా అంతా చాలా డామినేటింగా చేశాడు. సప్తగిరి కొన్ని చోట్ల నవ్విస్తాడు. పోసాని కృష్ణ మురళిది రెగ్యులర్ పాత్రే. మిగతానటులు అంతా పరిథి మేర కనిపించారు.
సాయికార్తీక్ పాటల్లో చమ్మక్ చమ్మక్ పోరి బావుంది. నేపథ్య సంగీతం ఓకే. కెమరాపనితనం, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రాస కోసం ప్రాకులాడిన మాటలు తప్పితే గుర్తుపెట్టుకునే మాటలు లేవు. కొత్తదర్శకుడు రమేష్… పక్కా కమర్షియల్ సినిమా చేయాలనే దిగాడు. అన్ని కమర్షియల్ మసాల దినుసులని టేపుతో కొలిచిమరీ స్టౌవ్ మీద వేశాడు. కానీ స్టౌవ్ వెలిగించడం మర్చిపోయాడు. దీంతో మీటర్ మేటర్ లేకుండా మిగిలిపోయింది.