మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ కార్టెల్ అధినేత ఎల్ మాంచోను ఆర్మీ కాల్చి చంపేసింది. ఈ హై-ప్రొఫైల్ ఎన్కౌంటర్ తర్వాత మెక్సికో వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ డ్రగ్ కార్టెల్ చాలా పవర్ ఫుల్ . ఓ రకంగా రెండో ప్రభుత్వంగా వ్యవహరించేది. అక్కడి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయేది. నిజానికి పరోక్ష సహకారం కూడా ఉండేది. అయితే అమెరికా కన్నెర్ర చేసి హతం చేయాలని తేల్చి చెప్పడంతో మెక్సికో సైన్యం అమెరికా నిఘా వర్గాల సహకారంతో జాలిస్కో రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో చుట్టుముట్టి ఎల్ మాంచోను హతం చేసింది.
డ్రగ్ లార్డ్ను చంపినందుకు రగిలిపోతున్న మెక్సికో
ఎల్ మాంచోను హతం చేసినట్లుగా బయటకు తెలియగానే మెక్సికో అగ్నిగుండంగా మారింది. తన యజమానిని చంపినందుకు నిరసనగా డ్రగ్ మాఫియా ముఠాలు రోడ్లపై బస్సులను, ట్రక్కులను తగులబెడుతూ, బాంబు దాడులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. మెక్సికోలోని ప్రధాన నగరాలు ఇప్పుడు యుద్ధ భూములను తలపిస్తున్నాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
మదురోను తీసుకెళ్లినట్లుగా తీసుకెళ్లిపోతారని మెక్సికో ప్రెసిడెంట్ భయం
గతంలో డ్రగ్ మాఫియా పట్ల కొంత ఉదాసీనంగా ఉన్న ప్రభుత్వాలు, వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా లక్ష్యంగా చేసుకున్న పరిణామాలను గమనించాయి. తన అధికారం కూడా ప్రమాదంలో పడవచ్చని, లేదా అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చని భావించి, ముందస్తుగా ఎల్ మాంచో ను ఏరివేయాలని మెక్సికో అధ్యక్షురాలు ఆర్మీని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ పరోక్షంగా వ్యవస్థలను శాసించిన ఒక డాన్ను, తన పదవి కాపాడుకోవడానికి అధ్యక్షురాలే బలిపీఠం ఎక్కించారనేది ఇక్కడ బహిరంగ రహస్యం.
ఆర్మీతోనే యుద్ధం చేస్తున్న డ్రగ్స్ మాఫియా
ఎల్ మాంచోను హతం చేసినందుకు జరుగుతున్న అల్లర్లు సామాన్యుల ఆగ్రహం కాదు, అది ఒక వ్యవస్థీకృత నేర ముఠా చేస్తున్న విద్వంసం. స్కూళ్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి, పౌరులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కేవలం జాలిస్కోలోనే కాకుండా మెక్సికోలోని దాదాపు 22 రాష్ట్రాల్లో ఈ అల్లర్లు వ్యాపించడం చూస్తుంటే, ఒక డ్రగ్ డాన్ ప్రభుత్వానికి సమాంతరంగా ఎంతటి బలమైన వ్యవస్థను నిర్మించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆర్మీతో పోరాడటానికి ఈ ముఠాలు ఏకంగా రాకెట్ లాంచర్లను, అత్యాధునిక ఆయుధాలను వాడుతుండటం ఆ దేశ భద్రతా స్థితిగతులకు నిదర్శనం.
మాఫియాలకు ఇలాంటి ముగింపేది !
ఎల్ మాంచోను కొందరు తన అనుచరులు ఆరాధ్య దైవంగా భావించినా, అతను సాగించిన రక్తపాతం, డ్రగ్స్ మాఫియా ద్వారా లక్షలాది మంది జీవితాలను నాశనం చేసిన పాపం అతడిని వెంటాడింది. ఎంతటి అజేయమైన శక్తిగా ఎదిగినా, ఒక దశలో తనను కాపాడిన రాజకీయనాయకులే తనను అంతమొందిస్తారనే చేదు నిజాన్ని ఎల్ మాంచో మరణం మరోసారి రుజువు చేసింది. ఒక నేర సామ్రాజ్యం ఎంత వైభవంగా వెలిగినా, దాని ముగింపు మాత్రం ఇలాంటి హింసాత్మక ఎన్కౌంటర్లతోనే ఉంటుందని చరిత్ర చెబుతోంది.
