ఆసియాలో అతిపెద్ద పెట్టుబడిని ఇండియాలో పెట్టబోతున్నట్లుగా మైక్రోసాప్ట్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈవో సత్యనాదెళ్ల ఇండియాకు వచ్చారు. ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. ఈ చర్చల్లో ఇండియాలో ఏఐ ఫస్ట్ ఫ్యూచర్ కోసం 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత సత్యనాదెళ్ల ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. 17.5 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయాల్లో లక్షన్నర కోట్లుపైనే.
భారత్ AI అవకాశాలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు, యువత నైపుణ్యాలు, సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నాదెళ్ల తెలిపారు. ఇది ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద పెట్టుబడి. ఇటీవలి కాలంలో ఏఐ రంగంపై టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్ కంపెనీ ఏఐ హబ్ గా విశాఖను ఎంచుకుని భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఆ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ విషయంలో ఇండియా కేంద్రంగానేతమ కార్యకలాపాలు ఉండాలని కోరుకుంటోంది.
మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడిని ఏ రాష్ట్రంలో పెడుతుందన్నదానిపై ఇంకా ప్రకటన రాలేదు. మొత్తం ఆలోచించుకునే పెట్టుబడి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. సత్యనాదెళ్ల ఆంధ్రకు చెందిన వారు. అయితే ఈ కారణంగా ఏపీపై ప్రత్యేకమైన అభిమానం చూపి ఇన్వెస్ట్ మెంట్ తీసుకురాలేరు. కంపెనీ అవసరాలు, వ్యూహాలకు తగ్గట్లుగా మైక్రోసాఫ్ట్ టీం నిర్ణయం తీసుకుంది. ఆ లక్కీ రాష్ట్రం ఏదన్నది త్వరలో తెలిసే అవకాశం ఉంది.