భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. గతంలో భారతీయులు తమ 40వ పడిలో లేదా రిటైర్మెంట్కు చేరువలో ఉన్నప్పుడు మాత్రమే సొంత ఇంటి గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేగంగా మారుతోంది. దేశంలో ఇల్లు కొనుగోలు చేసే వారి సగటు వయస్సు 38 ఏళ్ల నుండి 34 ఏళ్లకు తగ్గిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అంటే, కెరీర్ ప్రారంభించిన పదేళ్లలోపే యువత తమకంటూ ఒక సొంత గూడు ఉండాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా 35 ఏళ్లలోపు ఉన్న యువత ముఖ్యంగా మిలీనియల్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్‌ను కేవలం పెట్టుబడిగా చూడటం లేదు. అద్దె ఇళ్లలో ఉండే ఇబ్బందుల కంటే, సొంత ఇంటిలో ఉండే భద్రత , సామాజిక హోదాకే వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కోవిడ్ అనంతర పరిణామాల వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరగడం , ఇంటి నుండే కార్యాలయ పనులు చేసుకునేందుకు అనువైన విశాలమైన గదులు కావాలనుకోవడం ఈ మార్పుకు ప్రధాన కారణమని అనుకోవచ్చు.
మిలీనియల్స్‌లో పెరుగుతున్న కొనుగోలు శక్తికి బ్యాంకుల నుంచి సులభంగా లభిస్తున్న గృహ రుణాలు , ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు తోడవుతున్నాయి. గతంలో పొదుపు చేసిన తర్వాతే ఇల్లు కొనాలనే ఆలోచన ఉండేది, కానీ నేటి యువత ముందు ఇల్లు కొని, ఆ తర్వాత ఈఎంఐల ద్వారా చెల్లించడం మేలని భావిస్తున్నారు. దీనివల్ల టైర్-2 నగరాలతో పాటు మెట్రో నగరాల్లో చిన్న , మధ్య తరహా ఫ్లాట్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.
ఈ ధోరణి వల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. యువతను ఆకర్షించేలా స్మార్ట్ హోమ్ ఫీచర్లు, జిమ్, కో-వర్కింగ్ స్పేస్ , క్లబ్ హౌస్ వంటి ఆధునిక వసతులతో కూడిన ప్రాజెక్టులను ఎక్కువగా చేపడుతున్నారు. కేవలం నివాసం కోసమే కాకుండా, భవిష్యత్తులో ఆస్తి విలువ పెరుగుతుందనే నమ్మకంతో యువత చేస్తున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి.
