సినీ కార్మికుల ఇండ్ల కోసం కేటాయించిన హైదరాబాద్ చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశారా..? తను కోరినట్లుగా ప్లాట్లు ఇస్తే సరేసరి, లేదంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయేలా చేస్తానని బెదిరించారా..? అధికారులు సైతం సదరు మంత్రి ఆదేశాలతోనే రిజిస్ట్రేషన్లను నిలిపివేశారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశారని, తనకు రెండు ప్లాట్లు ఇవ్వాలని సొసైటీ ప్రతినిధులను డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు వారు నిరాకరించడంతో తన అధికారాన్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్లాట్లను అమ్మేందుకు నిర్ణయించారు. కానీ, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వారికి నగదు అందక పెళ్లిళ్లు కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనిపై రిజిస్ట్రేషన్ అధికారులను వారు కలిసి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరని నిలదీస్తే అధికారులు బెదిరిస్తున్నారని టాక్ వస్తోంది.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారికి ఫిర్యాదులు కూడా అందినట్లు సమాచారం. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆయన కూడా ఈ విషయంపై సైలెంట్ అవ్వడం పట్ల అనుమానాలు వస్తున్నాయి. చిత్రపురి కాలనీపై కన్నేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖతో సంబంధం లేదు. అయినా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ శాఖ విషయాల్లో వేలు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం అటు, ఇటుగా చేరి చివరికి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిందని , కొద్ది రోజులుగా లోక్ సభ ఎన్నికల బిజీలో రేవంత్ ఉన్నారు. ఇప్పుడు పాలనపై ఫోకస్ పెడుతామని తాజాగా ప్రకటించడంతో త్వరలోనే ఆయన ఈ అంశంపై ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.