ఉచిత బస్సు పథకంలో జిల్లాల పరిధిలోనే ఉచితం అని.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి అసెంబ్లీలో ప్రకటించారు. ఆమె అలా ప్రకటించారని వైసీపీ నేతలు మరో రకమైన ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం ఉచితం కాకుండా.. జిల్లాల పరిధికే పరిమితం చేశారని హామీకి తూట్లు పొడిచారని అంటున్నారు. అయితే వారు ఎక్కడా ఉచిత బస్సు పథకం రాష్ట్రం మొత్తం ఉంటుందని టీడీపీ హామీ ఇచ్చినట్లుగా ఆధారం చూపించడం లేదు. చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత పథకం అమలు చేస్తామని చెప్పిన వీడియోలు పదుల సంఖ్యలో ఉన్నాయి.
ఉచిత బస్సు పథకాన్ని ఉమ్మడిజిల్లాల పరిధిలో అమలు చేస్తామని పదే పదే టీడీపీ నేతలు చెప్పారు.చంద్రబాబు ప్రచారం చేశారు. అందులో దాపరికమేమీ లేదు. కానీ వైసీపీ మాత్రం రాష్ట్రమంతటా వర్తిస్తుందన్నట్లుగా చెబుతున్నారు. అంటే శ్రీకాకుళంలో ఉన్న వారు..కడపకు ఉచితంగా ప్రయాణించవచ్చని చెబుతున్నారు. జగన్ రెడ్డి కూడా మా రాయలసీమ మహిళలు.. ఉచిత బస్సు వేస్తే అమరావతిని చూస్తారంటూ అతి తెలివి రైటర్ రాసిచ్చిన స్క్రిప్టును కూడా చదివారు.
ఉచిత బస్సు అనేది మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించడానికి తెస్తున్న పథకం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లేవారు.. చిరుద్యోగులు, చిరు వ్యాపారులు… ఇతరులు చార్జీల ద్వారా ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీన్ని మిగిలించి వారికి మరింత మెరుగైన ఆర్థిక స్థిరత్వం వచ్చేలా చేయడానికి ఈ పథకానికి డిజైన్ చేశారు. అయినా వైసీపీ నేతలు మాత్రం.. తప్పుడు ప్రచారాలను చేయడం ఆపడం లేదు.