మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పుడే నీరసం వచ్చేసింది. రెండేళ్లు పూర్తి కాక ముందే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదోనని వేదాంతం మాటలు మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఆయన.. ఆ జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజలు, లీడర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన చేతిలో ఉన్న పనులు చేస్తాను కానీ హామీని ఇవ్వలేనని చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదోనని .. ఒక వేళ గెలిచినా.. పార్టీ గెలుస్తుందో లేదో అని ఆయన నిరాశగా మాట్లాడారు. ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. జూపల్లి కృష్ణారావుకు పరిస్థితి అర్థమవుతుందని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. జూపల్లికి ఎందుకు అంత నిరాశ కలుగుతుందో కానీ.. ఆయన మాటలు మాత్రం .. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను మోరల్ గా ఇబ్బంది పెట్టేవే.
ఏ ప్రభుత్వంలో ఉన్నా.. ఏ పార్టీ అయినా సరే వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామనే చెబుతారు. చివరికి కేఏ పాల్ కూడా గెలిచి తీరుతామని చెబుతారు. రేవంత్ రెడ్డి వచ్చే సారి గెలుపు మాదేనని ఢంకా బజాయించి చెబుతూంటారు. ఇతర మంత్రులూ అంతే.. కానీ ఒక్క జూపల్లికి మాత్రం.. తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుదో లేదో అన్న సందేహం మాత్రం వచ్చేసింది. అందుకే హామీలు ఇవ్వబోనని అంటున్నారు.