ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విద్యా మంత్రి నారా లోకేష్ కొత్త ఆలోచన చేశారు. స్కూళ్లను దత్తత ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం నాడు, నేడు పేరుతో వేల కోట్లు ఖర్చు చేసింది కానీ.. కొన్ని కుర్చీలు, రంగులు తప్ప చేసిందేమీ లేదు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు. అందుకే నారా లోకేష్ వినూత్నంగా ఆలోచించారు.
దేశ, విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడు నలభై, యాభై వయసులో ఉండి.. జీవితంలో పైకి ఎదిగిన వారంతా.. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారే. అంత కంటె ఎక్కువ వయసు ఉన్న వాళ్లయితే ఇక చెప్పాల్సిన పని లేదు. వారి స్కూలింగ్ అంతా ప్రభుత్వ స్కూళ్లలోనే. అలాంటి వారి తమ స్కూళ్లకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ వారికి సరైన మార్గం కనిపించదు. అందుకే నారా లోకేష్..కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నారు.
ఆసక్తిగల తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలికసదుపాయాలతో ప్రత్యేకమైన వెబ్ సైట్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. జాతీయస్థాయిలో పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. విద్యావ్యవస్థలో సంస్కరణలను శరవేగంగా అమలు చేసి.. విద్యా రంగంలో సమూలమైన మార్పులు తేవాలనుకుంటున్న లోకేష్..వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించారు.