ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదను జగన్ మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం ఎలా లూటీ చేశారో మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం ఆధారాలతో సహా బయటపెట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి.. ఆ నిధులను తన బినామీ కంపెనీలకు మళ్లించారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్, ఇసుక అక్రమాలు ,షెల్ కంపెనీల ద్వారా జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారాలను మంత్రి ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు.
జగన్ హయాంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయల నగదును ప్రభుత్వ ఖజానాకు కాకుండా, సొంత వ్యక్తులకు చేరేలా వ్యవస్థను రూపొందించారు. ఈ నిధులను దుబాయ్‌లోని షెల్ కంపెనీల ద్వారా లాండరింగ్ చేసి, విదేశాల్లో మైనింగ్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా మార్చారని ఆరోపించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేసిన దర్యాప్తులో ఈ మనీ ట్రైల్ స్పష్టంగా బయటపడిందని, దీనికి సంబంధించిన ఆధారాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం విడుదల చేసిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని పార్థసారథి విమర్శించారు. పంచాయతీ నిధులు, ఉపాధి హామీ నిధులు, గృహనిర్మాణ పథకాలకు రావాల్సిన సుమారు 8,000 కోట్ల రూపాయలను మళ్లించి తన సొంత ప్రచారానికి, పార్టీ అవసరాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ కేవలం తన కంపెనీల సంపదను పెంచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించారని, రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతి సిమెంట్ కంపెనీకి, సాక్షి మీడియాకు ప్రజాధనాన్ని వందల కోట్లు తరలించారని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఆర్థిక నేరాలపై ఇప్పటికే సిట్,ఇతర దర్యాప్తు సంస్థలు లోతైన విచారణ జరుపుతున్నాయని మంత్రి తెలిపారు. జగన్ తనను తాను పేదల పక్షపాతిగా చెప్పుకుంటూనే, తెరవెనుక వేల కోట్లు కొల్లగొట్టారని.. ఈ పాపాలన్నీ త్వరలోనే ప్రజల ముందు సాక్ష్యాలతో సహా బయటపడతాయని ప్రకటించారు.
