‘హనుమాన్’ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకొన్నాడు తేజా సజ్జా. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత చాలా అవకాశాలు వచ్చినా ఆచితూచి అడుగులేసి.. ‘మిరాయ్’ అనే కథని ఎంచుకొన్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సెప్టెంబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు టీజర్ వచ్చింది.
2 నిమిషాల 23 సెకన్ల టీజర్ ఇది. దాదాపు ట్రైలర్లానే అనిపించింది. కంటెంట్ కూడా కావల్సినంత ఉంది. ఇదో సూపర్ హీరో కథ. ‘మిరాయ్’ అంటే ఓ ఆయుధం. ఆ ఆయుధం హీరో చేతికి ఎలా వచ్చింది? వచ్చాక ఏం చేశాడన్నదే ‘మిరాయ్’ కథ.
ఈ టీజర్ విజువల్ ఫీస్ట్ లా అనిపించింది. వీఎఫ్ఎక్స్ షాట్లు అదిరిపోయాయి. సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో కానీ, ప్రతీ పైసా తెరపై కనిపించింది.
”జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీన్ని ఆపలేదు” అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఈ డైలాగ్ లోనే ఈ కథేమిటో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.
మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. తన అప్పీరియన్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. తనకు ఇది మంచి కమ్ బ్యాక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
”9 బుక్స్.. 100 బుక్స్.. 1 స్టిక్… బిగ్ అడ్వెంచర్” అంటూ హీరో తేజా సజ్జా కదనరంగంలోకి దూకడంతో కథ లో ఆసక్తి మొదలవుతుంది. ‘మిరాయ్’ అంటే ఏమిటో ఓ డైలాగ్ తో చెప్పేశారిందులో.
టీజర్ లో చాలా షాట్స్ ‘వావ్’ అనిపించేలా ఉన్నాయి. చివర్లో కోతుల గుంపు.. దండాలు పెడుతున్న షాట్ హైలెట్ గా చెప్పుకోవాలి. అది ‘హనుమాన్’ ఎంట్రీ అనుకోవాలా? శ్రీరాముడి దర్శనం అనుకోవాలా? అనేది సస్పెన్స్. మొత్తానికి ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కథలో దైవత్వానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయన్నమాట.
హరి గౌర ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించారు. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సన్నివేశాల్ని మరింత ఎలివేట్ చేశాయి. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుందన్న విషయం టీజర్లోనే తెలిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పటిలానే భారీగా ఖర్చు పెట్టిన తీసిన సినిమా ఇది. విడుదల చేసింది టీజరే అయినా ఓ సినిమా చూసినంత ఎఫెక్ట్ ఇచ్చింది. హనుమాన్ తరవాత తేజా సజ్జాకి ఎలాంటి సినిమా పడాలో.. అలాంటి సినిమా ఇది అనిపిస్తోంది. మొత్తానికి ‘మిరాయ్’కి ఇది మంచి ఆరంభం అని చెప్పుకోవాలి.