మిస్ ఇండియా రివ్యూ – మిస్ ఫైర్‌

గెలుపు క‌థ ఎప్పుడూ గొప్ప‌గా ఉంటుంది. కానీ ఓడి.. ఓడి… గెల‌వ‌డంలో ఉన్న మ‌జా వేరు. అందుకే మ‌న‌కు స‌క్సెస్ స్టోరీస్ కంటే… ఫెయిల్యూర్ స్టోరీసే ఎక్కువ స్ఫూర్తి ఇస్తుంటాయి. `మిస్ ఇండియా` కూడా… అలాంటి క‌థే. ఏమీ లేని అమ్మాయి – త‌న‌ది కాని దేశంలో అడుగుపెట్టి – వాళ్ల‌కు ప‌రిచ‌యం లేని `టీ`ని అమ్మి – అక్క‌డ ఎదురే లేని ఓ వ్యాపార వేత్త‌ని ఢీ కొట్టి – ఎలా విజయం సాధించింది? అన్న‌ది `మిస్ ఇండియా` స్టోరీ. ఈ క‌థ‌లో గెలుపు ఉంది. కానీ సినిమా ఎలా వుంది? ఆ గెలుపు స్ఫూర్తి నిచ్చేలా వుందా? లేదంటే – ఆ గెలుపు కేవ‌లం క‌థ‌లోనే వుందా?

* క‌థ‌

మాన‌స సంయుక్త (కీర్తి సురేష్‌)ది విశాఖ‌ప‌ట్నం ద‌గ్గ‌ర్లోని ఓ మారుమూల ప‌ల్లెటూరు. తాత‌య్య విశ్వ‌నాథ శాస్త్రి (రాజేంద్ర ప్ర‌సాద్‌) అంటే చాలా ఇష్టం. ఆయ‌నో ఆయుర్వేద వైద్యుడు. టీతోనే అన్ని రోగాల్నీ న‌యం చేస్తుంటాడు. అలా… టీ అంటే ఇష్టం ప్రేమ ఏర్ప‌డ‌తాయి సంయుక్త‌కు. పెరిగి పెద్దై… ఓ వ్యాపార వేత్త కావాల‌న్న‌ది మాన‌స ల‌క్ష్యం. అయితే… పెద్ద‌య్యాక ఇంట్లో ప‌రిస్థితులు మారిపోతాయి. తండ్రి (న‌రేష్‌)కి అల్జీమ‌ర్‌. తాత‌య్య చ‌నిపోతాడు. ఇంటి స‌మ‌స్య‌లు కొడుకు (క‌మ‌ల్ కామ‌రాజు)పై ప‌డ‌తాయి. త‌న‌కు అమెరికాలో ఉద్యోగం వ‌స్తుంది. దాంతో.. కుటుంబం అంతా.. అమెరికా షిఫ్ట్ అవుతుంది. అక్క‌డి యూనివ‌ర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి, త‌న‌కు ఇష్టం లేక‌పోయినా ఓ ఉద్యోగం చేస్తుంది. కానీ.. మ‌న‌సుతో రాజీ ప‌డ‌లేక అక్క‌డ రాజీనామా చేసి, బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. త‌న‌కిష్ట‌మైన వ్యాపార రంగంలో అడుగుపెట్టాల‌నుకుంటుంది. అమెరికాలో ఎక్క‌డ చూసినా కాఫీనే త‌ప్ప‌.. టీ దొర‌క‌దు. అందుకే త‌న‌కు తెలిసిన‌, త‌న‌కు ఇష్ట‌మైన టీని అమెరికాకి రుచి చూపించాల‌నుకుంటుంది. ఆ ప్ర‌యాణంలో మాన‌స‌కు ఎలాంటి అవ‌రోధాలు ఎదుర‌య్యాయి? ఈ వ్యాపారంలో ఎలా నిల‌దొక్కుకుంది? అనేది మిగిలిన క‌థ‌.

* విశ్లేష‌ణ‌

తెలుగు సినిమాల‌పై ఎప్పుడూ ఓ జోక్ వినిపిస్తుంటుంది. ఒకే ఒక్క పాట‌లో… పేద‌వాడైన హీరో ధ‌నికుడు అయిపోతుంటాడు. రిక్షాలు తొక్కి, స్కూట‌రు ఎక్కి… పాట పూర్త‌య్యేలోగా విమానాల్లో తిరిగేస్తాడు. ఆ ఒక్క పాట‌లోనే మేడ‌లూ మిద్దెలూ క‌ట్టేస్తుంటాడు. `ఒక్క పాట‌లో కోటీశ్వ‌రుడు` అన్న కాన్సెప్ట్ ని తెలుగు ప్రేక్ష‌కులు కూడా పెద్ద మ‌న‌సుతో ఒప్పుకున్నారు కూడా. అలా 5 నిమిషాల పాట‌కు ప‌రిమితం చేసేసిన కాన్సెప్టుని 2 గంట‌ల 20 నిమిషాల సినిమాగా తీస్తే… అదే `మిస్ ఇండియా`.

ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి.. అమెరికాలోనే పెద్ద బిజినెస్ టైకూన్‌తో పోటీ ప‌డి, రెండంటే రెండు నెలల్లో గ‌జ‌గ‌జ‌లాడించేయ‌డం, ఆ వ్యాపారంలోనే నెంబ‌ర్ వ‌న్ గా ఎద‌గ‌డం.. `మిస్ ఇండియా` పాయింట్‌. యండ‌మూరి న‌వ‌ల‌ల్లో, సినిమాల్లో ఈ త‌ర‌హా క‌థ‌లు, ఛాలెంజులు, పాత్ర‌లూ క‌నిపిస్తాయి. సినిమా మొద‌లైన‌ప్పుడే హీరోయిన్ గెలిచి తీరుతుంది అని ప్రేక్ష‌కుడికి తెలుసు. కానీ.. ఎలా…? అన్న‌దే ముఖ్యం. ఆ `ఎలా` చుట్టూనే క‌థ సాగాలి. అదే స్ఫూర్తి ర‌గిలించాలి. అమెరికాలో ఏళ్ల‌కు ఏళ్లుగా వ్యాపారం చేస్తూ.. దిగ్గ‌జంగా పేరొందిన ఓ బ‌ల‌వంతుడ్ని సాధార‌ణ‌మైన అమ్మాయి ఓడించిందంటే.. ఆ పోరాటంలో ఎంత తెగువ‌, ఎంత తెలివి ఉండాలి? కానీ ఆ స్ఫూర్తి, తెగువ‌, తెలివి… ఇవేమీ.. ఈ `మిస్ ఇండియా` లో క‌నిపించ‌వు.

క‌థ ప్రారంభ‌మే చాలా ఫ్లాట్ గా ఉంటుంది. నాన్న‌కి అల్జీమ‌ర్‌, తాత‌య్య మ‌ర‌ణం, అక్క‌.. ప్రేమించిన వ్య‌క్తితో వెళ్లిపోవ‌డం … ఇలా అన్నీ స‌మ‌స్య‌లే. దాంతో క‌థ భారంగానే మొద‌ల‌వుతుంది. అమెరికా వెళ్లాక కూడా… జోరుండ‌దు. అక్క‌డ పేథాస్ సినిమాల్లో హీరోలా.. న‌వీన్ చంద్ర క‌నిపిస్తాడు. ఈ క‌థ‌కు కొంచెమైనా హుషారు ఇద్దాం.. అన్న ఆలోచ‌న ద‌ర్శ‌కుడికి రాలేదు. న‌వీన్ చంద్ర‌తో ట్రాక్‌.. క‌థ‌ని పొడిగించ‌డానికి, స‌న్నివేశాల్ని పెంచుకోవ‌డానికి త‌ప్ప దేనికైనా ఉప‌యోగ‌ప‌డిందా? సెకండాఫ్ లో.. క‌నీసం క్లైమాక్స్‌లో అయినా ఆ పాత్ర ఎందుకు క‌నిపించ‌దో.. అర్థం కాదు. మాన‌స సంయుక్త క‌ల వ్యాపారం చేయ‌డం. దాన్ని కేవ‌లం సెకండాఫ్‌కి ప‌రిమితం చేశాడు. జ‌గ‌ప‌తిబాబు తో ఛాలెంజ్ విస‌ర‌డం, అక్క‌డ జ‌గ్గూభాయ్‌.. అహం ఇవ‌న్నీ బాగానే పండాయి. దాంతో సెకండాఫ్‌లో పోటా పోటీ స‌న్నివేశాల్ని చూడొచ్చ‌న్న న‌మ్మ‌కం క‌లుగుతుంది.

కానీ అంత పెద్ద బిజినెస్ టైకూన్ కూడా… `మిస్ ఇండియా` ధాటికి డంగై పోవ‌డం విచిత్రంగా ఉంటుంది. కొన్ని స‌న్నివేశాలు చూస్తుంటే, అస‌లు బిజినెస్ థీరీ తెలిసే ద‌ర్శ‌కుడు స‌న్నివేశాలు రాసుకున్నాడా? అనేది అనుమానంగా ఉంటుంది. ఏ కంపెనీ అయినా ప‌బ్లిక్ ఇష్యూలోకి దిగితే… జ‌నాలెవ‌రూ నేరుగా కంపెనీకి వ‌చ్చి నోట్ల క‌ట్ట‌లు ఇవ్వ‌రు. మ‌రో కంపెనీ గ‌ట్టి పోటీ ఇచ్చినంత మాత్రాన‌, వేల కోట్ల అధిప‌తి.. ఒక్క యేడాదిలో బికారిగా మారిపోరు. ఇలా చాలా స‌న్నివేశాలు అస‌లేమాత్రం క‌స‌ర‌త్తు చేయ‌కుండా రాసుకున్న‌వే. `వ్యాపారం ఓ యుద్ధం` అని భావించిన ఇద్ద‌రి మ‌ధ్య‌.. యుద్ధం ఎప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా సాగాలి. కానీ.. ఇక్క‌డ మాత్రం చ‌ప్ప‌గా ఉంటుంది. `న‌మ్మిన వాళ్ల‌ని మోసం చేయ‌డం అన్న‌ది మ‌హాభార‌తం నుంచీ ఉన్న‌దే` అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. అదే మోసాన్ని వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. అలా చాలా స‌న్నివేశాల్లో ఓల్డ్ ఏజ్ ఫార్ములాని వాడుకుంటూ.. స‌న్నివేశాల్ని న‌డిపించాడు.

* న‌టీన‌టులు

`జాతీయ ఉత్త‌మ న‌టి… కీర్తి సురేష్‌` అని టైటిల్ కార్డులోనే ఘ‌నంగా వేసేశారు. నిజమే.. కీర్తి జాతీయ ఉత్త‌మ న‌టి. కానీ.. ఆ న‌టిని ప‌రీక్షించే స‌న్నివేశాలు, సంద‌ర్భాలూ.. ఈ క‌థ‌లో లేవు. ఈ సినిమాని న‌డిపించిన పాత్ర కీర్తిది కావొచ్చు గానీ, కీర్తి మాత్ర‌మే ఈ పాత్ర చేయ‌గ‌ల‌దు అనుకునే స్థాయిలో.. ఆ పాత్ర లేదు. కానీ.. త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌న‌చ్చుతుంది. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. మోడ్ర‌న్ దుస్తుల్లోనూ అందంగా, హుందాగా క‌నిపించింది. రాజేంద్ర ప్ర‌సాద్‌, న‌దియాల‌వి త‌క్కువ నిడివి, ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లే. న‌వీన్ చంద్ర‌ని హీరో అన‌లేం. నాలుగైదు స‌న్నివేశాల్లో క‌నిపించాడు. జ‌గ‌ప‌తిబాబు ఎప్ప‌టిలా స్టైలీష్ విల‌న్ పాత్ర‌లో మెప్పించాడు. అయితే తొలి స‌న్నివేశంలో త‌న‌లో క‌నిపించిన గాంభీర్యం.. అమాంతం సెకండ్ సీన్‌లోనే ప‌డిపోతుంది.

* సాంకేతిక వ‌ర్గం

క‌థ‌లో మెరుపుల్లేవు. ఓ ఆడ‌ది ఏదైనా సాధించ‌గ‌ల‌దు.. అన్న పాయింట్ త‌ప్ప‌. దాన్ని.. హుషారుగా, ఇంటిలిజెంట్ గా డీల్ చేయాల్సింది. తొలి స‌గంలో… నీర‌సంగా, నిత్తేజంగా న‌డిస్తే – రెండో స‌గంలో స్ఫూర్తి, సృజ‌న క‌రువ‌య్యాయి. పాట‌ల‌కు ఈ సినిమాలో స్కోప్ లేదు. అమెరికా నేప‌థ్యంలో సాగే క‌థ కాబ‌ట్టి… కంటికి కొత్త లొకేష‌న్లు క‌నిపించాయి. కొత్త ఫ్లేవ‌ర్ వ‌చ్చింది. మాట‌లు అక్క‌డ‌క్క‌డ ఆక‌ట్టుకుంటాయి. ఆడ‌ది ఏ విష‌యంలో త‌క్కువ‌ ?.. అనే సంద‌ర్భంలో వ‌చ్చే సంభాష‌ణ‌లు బాగున్నాయి.

ఫైన‌ల్ గా చెప్పాలంటే `మిస్ ఇండియా`.అమెరికాలో గెలుపు బావుటా ఎగ‌రేయాల‌నుకున్న ఓ అమ్మాయి క‌థ‌. ఈ క‌థ‌లో గెల‌వాల‌న్న స్ఫూర్తి ఉంది. కానీ క‌థ‌ని న‌డిపించే విధానంలోనే గెలిపించే ల‌క్ష‌ణాలు మృగ్య‌మ‌య్యాయి.

తెలుగు360 రేటింగ్: 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవకాశాలు రాని టీఆర్ఎస్ నేతలకు ఆశాకిరణం ఈటల..!

ఈటల రాజేందర్ ఒక్క సారిగా తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యారు. తనంతట తాను టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి రాజకీయ పార్టీ పెట్టుకుంటే.. ఆయనను ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ కేసీఆర్ ...

“నిపుణులు” ఇప్పటికీ అమాయకులుగానే కనిపిస్తున్నారా..!?

భారతదేశంలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు కానీ... అంత కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా బారిన పడుతున్న ప్రజలకు కనీసం ఆక్సిజన్ అందించలేని దౌర్భాగ్య...

ఆ పేలుడు అంత సీరియస్ కాదా..? చర్యలేవి..?

కడప జిల్లాలోని సున్నపురాయి గనుల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనను వీలైనంత తక్కువగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పది మంది .. తునాతనకలైనా.. అధికారులు శరవేగంగా స్పందించలేదు. ఆ గని యజమాని ఎవరు..?...

మీడియా మైండ్‌సెట్‌తో వైసీపీ మైండ్ గేమ్..!

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ఓ వైపు కేంద్రం... ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమిడిసివర్ ఇంజక్షన్లు అన్నింటినీ అధీనంలోకి తీసుకుని అరకొరగా పంపుతోంది. దీంత ప్రజలు నానా...

HOT NEWS

[X] Close
[X] Close