కోవిడ్ సమయంలో బోలెడు కథలు జరిగాయి. వాటి ఆధారంగా ఇప్పటికే కొన్ని సినిమాలు, సిరిస్ లు వచ్చాయి. అందులో కొన్ని సీరియస్ గా సాగితే మరిన్ని కొన్ని ఫన్ ట్రీట్మెంట్ తో నడిచాయి. లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరిస్ కూడా అదే నేపధ్యంలో లైటర్ వెయిన్ ట్రీట్మెంట్ తో పాటు అతిశుభ్రం క్యారెక్టరైజేషన్ ఆధారం చేసుకొని తీర్చిదిద్దారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సిరిస్ లో వున్న వినోదం ప్రేక్షకులని ఆకర్షించిందా? మిస్ పర్ఫెక్ట్ లోని పెర్ఫెక్షనిజం నవ్వులు పంచిందా?
లావణ్య (లావణ్య త్రిపాఠి)కి పరిశుభ్రత అంటే పిచ్చి. తను వున్న చోట అన్నీ పద్దతిగా పరిశుభ్రంగా వుండాలి. ఢిల్లీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా పని చేసే లావణ్య హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. లావణ్య తండ్రి గోకుల్ (హర్ష వర్ధన్) అర్కిటెక్ట్. బెంగళూరులో ఉంటాడు. తనకి హైదరాబాద్ లో శాంతి నిలయం అనే ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వుంటుంది. ఆఫ్లాట్ లోనే దిగుతుంది లావణ్య. సరిగ్గా లావణ్య అక్కడికి వచ్చే సమయానికి కరోనా లాక్డౌన్ ప్రకటించడంతో లావణ్య ఇంట్లో పనిచేసే జ్యోతి (అభిజ్ఞ) పనికి రాలేకపోతుంది. తాను రాలేనన్న విషయాన్ని పక్క పోర్షన్లో ఉండే రోహిత్ (అభిజీత్)కు చెప్పమనడంతో లావణ్య అతడి ఇంటికి వెళ్తుంది. అక్కడ అపరిశుభ్రతను చూసి తట్టుకోలేక వెంటనే ఆ ఇంటిని క్లీన్ చేస్తుంది. అయితే కమ్యునికేషన్ గ్యాప్ వలన లావణ్యని పని మనిషిగానే చూస్తాడు రోహిత్. అలా వారి మధ్య ఒక అనుబంధం వచ్చేస్తుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది? తర్వాత ఏం జరిగింది? లావణ్య పని మనిషి కాదనే సంగతి రోహిత్ తెలుసుకున్నాడా? లేదా? లావణ్య అతి పరిశుభ్రత వలన ఎలాంటి పరిస్థితులు ఎదురుకుంది? ఈ కథలో రాజ్యలక్షీ( ఝాన్సీ) పాత్రేమిటి? సింగర్ కావాలని కోరుకున్న జ్యోతి కల నెరవేరిందా? అనేది తక్కిన కథ.
ఓసిడీ క్యారెక్టరైజేషన్ కు కోవిడ్ నేపధ్యాన్ని జోడించి తీసిన లైటర్ వెయిన్ కామెడీ సిరిస్ ఇది. లావణ్య పాత్ర పరిచయం చేయడానికి దాదాపు ఒక ఎపిసోడ్ అంతా సరిపోతుంది. ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో చూసి వుండటంతో అందులో కొత్తదనం ఏమీ అనిపించదు. పైగా సన్నివేశాలు, పాత్రలు కూడా నింపాదిగా వుంటాయి. రెండో ఎపిసోడ్ నుంచి ఇది లాక్ డౌన్, అపార్ట్మెంట్ డ్రామాగా మారుతుంది. ఇందులో లావణ్య పాత్రలో నెట్ ఫ్లిక్స్ పాపులర్ సిరిస్ ‘ఫ్రెండ్స్’ మోనికా పాత్ర స్ఫూర్తి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ లో మోనికా లానే ఎక్కడికి వెళ్ళినా అక్కడ శుభ్రంగా లేకపోతే స్వయంగా స్వచ్చభారత్ కార్యక్రమం చేపడుతుంది లావణ్య. కోవిడ్ కారణంగా పని మనిషి రాకపోతే రోహిత్ ఇంటికి వెళ్ళిన లావణ్య ఇదే పని చేస్తుంది. తర్వాత కథ.. మిస్ కమ్యునికేషన్ డ్రామాగా నడుస్తుంది. అయితే ఇదంతా సహజంగా అనిపించదు. పాత్రలు, సన్నివేశాల్లో మరీ పేలవంగా నడుస్తున్న భావనే కలుగుతుంది. తర్వాత రోహిత్ పై పని మనిషి జ్యోతి, అతడి తమ్ముడు, అపార్ట్మెంట్ వాచ్ మ్యాన్ చేసిన స్పైయింగ్ బోర్ కొట్టిస్తుంది.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గల ఈ సిరిస్ లావణ్య, రోహిత్- పనిమనిషి జ్యోతి, సింగర్ కావాలనే తన కల- హర్ష వర్ధన్, ఝాన్సీల రహస్య ప్రేమకథ.. ఇలా మూడు కోణాల్లో సాగినప్పటికీ .. ఇందులో ఏ కోణం కూడా ఉత్తేజకరంగా వుండదు. కంటెంట్ లేక సాగదీస్తున్న ఫీలింగే కలుగుతుంది. లావణ్య, రోహిత్ పాత్రల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా కుదరలేదు. ఆ పాత్రలతో ప్రేక్షకుడికి పెద్ద కనెక్షన్ రాదు. లావణ్యకు తప్పితే మరో పాత్ర క్యారెక్టరైజేషన్ రిజిస్టర్ కాదు. లాక్ డౌన్ కాలంలోని చోటు చేసుకున్న కష్టాలు చూపించే ప్రయత్నం చేశారు. చూపించిన కంటెంట్ రిచ్ అపార్ట్మెంట్ చుట్టూ నడిపిన పాత్రలు కావడం వలన వాళ్ళ లాక్ డౌన్ కష్టాలు కూడా అంతే రిచ్ గా అనిపిస్తాయి. లాక్ డౌన్ లో పోలీసుల కళ్ళుకప్పి ఉసిరికాయ పచ్చడి పెట్టడం ఎలా? అని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు రోహిత్. ఇలా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని కంటెంట్‌తో సాగిపోయింది సిరిస్ పైగా ముగింపు కూడా చాలా సాదాసీదాగా వుంటుంది.
లావణ్య పద్దతిగా కనిపించింది. అయితే ఆ పాత్రలో మొదట్లో వుండే హుషారు తర్వాత ఎపిసోడ్స్ లో కనిపించదు. ఒక దశలో క్యారెక్టరైజేషన్ నే వదిలేశారనే ఫీలింగ్ కలుగుతుంది. రోహిత్ ఇంటికి వెళ్లి పని చేయడానికి ఇంకా బలమైన కారణాలు చూపించివుంటే బావుండేది. అభిజీత్ కు సరిపడే పాత్రే ఇది. తన వంతు న్యాయం చేశాడు కానీ ఆ పాత్రలో ఆసక్తికరమైన ఆర్క్ లేదు. జ్యోతి పాత్రలో చేసిన అభిజ్ఞ మెప్పిస్తుంది. ఆమె సింగర్ కల మాత్రం ఈ కథలో సింక్ అవ్వలేదు. హర్షవర్షన్, ఝాన్సీ పాత్రల్లో బలం లేదు. మహేష్ విట్టా నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు పరిధిమేర వున్నారు. టెక్నికల్ సిరిస్ యావరేజ్ గా వుంది. కెమరాపనితనం, సంగీతం ఓకే అనిపిస్తాయి. మాటలు ఇంకా వినోదాత్మకంగా రాసుకోవాల్సింది.
సినిమాలో చెప్పడానికి వీలుపడనంత కంటెంట్ చెప్పే సౌలభ్యం వెబ్ సిరిస్ లో వుంది. ఈ రెండిటి గ్రామర్ వేరు. కథకు బిగినింగ్ ట్విస్ట్ ఎండింగ్ ఉన్నట్టే.. వెబ్ సిరిస్ లో ప్రతి ఎపిసోడ్ కి ఇలాంటి ఎత్తుగడ కుదరాలి. అప్పుడే సిరిస్ ఆసక్తికరంగా ముందుకు కదులుతుంది. ఈ సిరిస్ లో ఆ గ్రామరే తప్పింది.