లిక్కర్ స్కామ్‌లో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మిధున్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అలా సాగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ..ఆయన పిటిషన్ పై మళ్లీ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. అప్పటికి మధ్యం కేసులో మిధున్ రెడ్డిని నిందితుడుగా చేర్చకపోవడం, అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ కారణంగా ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది.
ప్రస్తుతం మిధున్ రెడ్డిని నిందితునిగా చేర్చారు. ఈ కారణమంగా మెరిట్స్ ఆధారంగా మళ్లీ ముందస్తు బెయిల్ పై నిర్ణయాన్ని వెల్లడించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. గతంలో మిధున్ రెడ్డికి ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు తొలగించింది. అయితే బెయిల్ పై హైకోర్టు తీర్పు ఇచ్చేంతవరకూ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 4 వారాల్లో మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అంటే నాలుగు వారాల పాటు మిథున్ రెడ్డి అరెస్టు లేనట్లే.
మిథున్ రెడ్డి లిక్కర్ స్కాంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆయన మనీలాండరింగ్ లో కీలక వ్యక్తి అని సీఐడీ చెబుతోంది. ప్రతి శనివారం ఆయన తాడేపల్లి ప్యాలెస్‌కు కలెక్షన్ల లెక్కలు చెప్పేవారు. అలాగే తన కుటుంబ కంపెనీలతో పాటు ఇతర కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ చేసేవారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి సీఐడీ ప్రశ్నించింది.