రెండు నెలలకుపైగా జైల్లో ఉన్న కనీసం గడ్డం కూడా పెరగకుండా.. కులాసాగా..దిలాసాగా అత్తారింట్లో గడిపినట్లుగా గడిపి జైలు నుంచి విడుదలైన పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఏం చేసినా తగ్గేది లేదంటున్నారు. ఏ విషయంలో తగ్గరో కానీ.. ఇలాంటి జైళ్లను తాము చూసినా సరే చేయాల్సిన స్కాముల్లో తగ్గేది లేదని చెబుతున్నట్లు ఆయన మాట తీరు ఉంది.
లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి కోసం లంచాలు వసూలు చేసి ప్రతి శుక్రవారం ఆయనకు లెక్కలు చెప్పిన విషయాన్ని వైసీపీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు. అయినా స్కామ్ ఏమీ జరగలేదని.. తప్పుడుకేసు పెట్టారని వాదించడానికి ఆయన ఏ మాత్రం సంకోచించడం లేదు. కేసు గురించి మాట్లాడకపోవడం అనేది బెయిల్ షరతుల్లో ఉండే ప్రాథమిక నిబంధన. కానీ అదే ఆయన మాట్లాడుతున్నారు.
తనను టెర్రరిస్టులా చూశారని.. ఎవరూ తనతో మాట్లాడలేదని ఆయన చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాల నిఘా పెట్టారని కూడా చెప్పారు. జైల్లో సీసీ కెమెరాలు లేకుండా ఉంటాయా?. కోర్టు ఆదేశించే వరకూ సౌకర్యాలు కల్పించలేదని కూడా చెప్పుకొచ్చారు..కానీ ఆదేశాల మేరకే అలాంటివి కల్పిస్తారన్న సంగతిని మర్చిపోయారు. టీడీపీ ఎప్పుడు వచ్చినా తమకు వేధింపులు ఉంటాయని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి కనీసం పరామర్శించలేదని ఆయన ఫ్యామిలీ అసంతృప్తిలో ఉందని ప్రచారం జరుగుతూండటంతో.. ఆయన అండగా నిలబడ్డారని చెప్పాలని సూచనలు రావడంతో ప్రెస్ మీట్ పెట్టినట్లుగా చెబుతున్నారు.