డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలంటే కేవలం సామాన్యులపై నిఘా పెడితే సరిపోదని, సమాజంపై తీవ్ర ప్రభావం చూపే సినీ నటీనటులు , ప్రజాప్రతినిధుల నుంచే ఈ ప్రక్షాళన మొదలుకావాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సినిమా వాళ్లందరికీ ప్రతి 90 రోజులకు ఒకసారి వీరందరికీ తప్పనిసరిగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అనిరుథ్ రెడ్డి వ్యవహారం మొదటి నుంచి పబ్లిసిటీ కోసం అన్నట్లుగానే ఉంటుంది. ఇప్పసారాకు బ్రాండింగ్ అయిపోయాక.. ఇప్పుడు టాపిక్ వచ్చిందని డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్లను టార్గెట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే ఆయన ఇప్ప సారాను తెలంగాణ టెకిలాగా అభివర్ణించి, దానిని బ్రాండింగ్ చేయాలని ప్రతిపాదించడం తీవ్ర వివాదానికి దారితీసింది. వబ్లిసిటీకి ఇప్పసారా టాపిక్ పాతబడగానే, ఇప్పుడు మోయినాబాద్ ఫాంహౌస్ కేసు వంటి తాజా అంశాలను పట్టుకుని మళ్లీ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా నటులకు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయాలని, లేదంటే వారి సినిమాలు విడుదల చేయకూడదని అనడం కేవలం మీడియాలో హైలెట్ అవడం కోసమే.
డ్రగ్స్ మూలాలు కేవలం ఒకే రంగంలో ఉండవని తెలిసినప్పటికీ, కేవలం గ్లామర్ ఫీల్డ్ ను టార్గెట్ చేయడం మీడియా అటెన్షన్ పొందే వ్యూహం దాగి ఉందనేది స్పష్టమవుతోంది. ఇలాంటి సంచలన వ్యాఖ్యల ద్వారా ఆయన తన నియోజకవర్గ సమస్యల కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. నిరంతరం వార్తల్లో ఉండే పబ్లిసిటీ స్ట్రాటజీ ని పాటిస్తున్నారు. కానీ ఆయన సొంత ఊళ్లలో పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. ముందుగా ఇంటిని చక్కదిద్దుకోవాలన్న సలహాలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి.
