వైఎస్ఆర్సీపీ పక్కా ప్రణాళికతో రాజకీయాలు చేస్తోంది. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని తేలిపోవడంతో తదుపరి వ్యూహంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆందోళనలు చేయడంతో పాటు.. రాజీనామాల వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. రాజీనామా చేసి.. ప్రజాగ్రహం ఏమిటో ప్రభుత్వానికి తెలిసేలా చేయాలనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలందరికీ.. రాజీనామాలకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు పంపినట్లుగా చెబుతున్నారు.
సానుభూతి ఉప్పొంగుతుందని అంచనా
ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ప్రజలు ఏ మాత్రం సహించరని ఆయన కోసం రోడ్డెక్కి ఉద్యమిస్తారని వైసీపీ వ్యూహకర్తలు నమ్ముతున్నారు. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించుకుంటే.. పూర్తి స్థాయిలో సీన్ మారిపోతుందన్న అంచనాకు వస్తున్నారు. అందుకే జగన్ ను అరెస్టు చేయగానే జగన్ తో సహా అందరూ రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్లే ప్లాన్ ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా..జగన్ ఉపఎన్నికల కోసం ప్లాన్లు వేసుకుంటున్నారు.
అరెస్టు చేసిన వెంటనే ప్రణాళికాబద్ధంగా నిరసనలు
జగన్ ను అరెస్టు చేసిన దగ్గర నుంచి ప్రణాళికాబద్ధంగా.. నిరసనలు భారీగా జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మండల గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలకు సందేశాలు పంపుతున్నారు. అయితే వారు ఎంత మంది యాక్టివ్ అవుతారన్నది చెప్పడం కష్టమే. జగన్ కు కష్టం వస్తుందనుకున్నప్పుడు అందరూ రోడ్ల మీదకు రావాలని… రచ్చ చేయాలని చెబుతున్నారు కానీ తమకు కష్టాలొచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడం ఆ పార్టీ క్యాడర్ ను స్లో చేసింది. అందుకే వారిని మోటివేట్ చేయడానికి ఇప్పటికే పలు రకాల చర్యలు చేపడుతున్నారు.
రాజీనామాలకు ఎమ్మెల్యేలు అంగీకరిస్తారా ?
జగన్ మినహా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో పెద్దిరెడ్డి మినహా మిగతా అంతా దాదాపు కొత్త వాళ్లే. మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం అంటే వారికి చిన్న విషయం కాదు. అదే సమయంలో వారికి రాజకీయాలపై కాస్త అవగాహన ఉంది. ప్రజాసమస్యల కోసం కాకుండా జగన్ కోసం రాజీనామా చేస్తే ఘోరమైన పరిస్థితులు వస్తాయని వారు భయపడే అవకాశం ఉంది. జగన్ ఆదేశాలను ఉల్లంఘించి రాజీనామాలు చేసేది లేదని అంటే.. జగన్ పరువు పోతుంది. అందుకే వీరితో సజ్జల డీల్ చేస్తున్నట్లుగా చెపుతున్నారు.