భక్తి అనేది కేవలం ఆడంబరం కాదు, అది క్రమశిక్షణతో కూడిన ఆరాధన. కానీ, నేటి కాలంలో కొందరు సోషల్ మీడియా సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు దైవ సన్నిధిని తమ ప్రచారానికి వేదికగా మార్చుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, చివరకు కోర్టు మెట్లు ఎక్కడం దైవభక్తి అనిపించుకోదు సదా, అది అహంకారపూరితమైన ప్రదర్శనగానే కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వంటి వారు పవిత్రమైన తిరుమల గిరులపై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, రీల్స్ చేయడం ద్వారా ఆధ్యాత్మికత కంటే తమ వ్యక్తిగత ప్రాచుర్యానికే ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమవుతోంది.
దేవుడంటే భక్తి, భయం ఉంటే ఇలా చేస్తారా?
తిరుమల కొండపై రీల్స్ తీసుకోవడంపై స్పష్టమైన నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ వీడియోలు చిత్రీకరించడం వెనుక దేవుడిపై భక్తి తో పాటు భయం లేకపోవడమే కనిపిస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం క్షేత్ర పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి బాధ్యత. అయితే, దివ్వెల మాధురి తో పాటు బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ తనూజ.. ఎమ్మెల్సీ అయిన దువ్వాడతో సహా తీసుకు వచ్చి బర్త్ డే వేడుకలను అక్కడే జరుపుకుని, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం భక్తుల దృష్టిలో ఒక అపచారంగా మారింది. దేవుడిని దర్శించుకోవడానికి వెళ్లిన వారు వివాదాల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరగడం భక్తికి ఏమాత్రం నిదర్శనం కాదు.
దేవుని సన్నిధిలో తప్పు చేసి కోర్టు మెట్లెక్కి.. మళ్లీ అదే తప్పు చేస్తారా?
అంతకు ముందు ఇలాంటి నేరం చేసినందుకే ఆమె కొండ దిగి కోర్టులో హాజరయ్యారు. మళ్లీ అదే తప్పు చేశారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు , సమాజంలో గుర్తింపు ఉన్న సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేసినప్పుడు అది మరింత చర్చనీయాంశమవుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి కోర్టుకు హాజరైన మాధురిపై పోలీసులు నమోదు చేసిన కేసులు, టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన ఫిర్యాదులు వారి ప్రవర్తన ఎంత అనైతికంగా ఉందో తెలియజేస్తున్నాయి. దైవ ప్రార్థన కంటే రీల్స్ , వీడియోల ద్వారా వచ్చే లైక్స్ ముఖ్యం అనుకోవడం భక్తిని కించపరచడమే అవుతుంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలను కేవలం టూరిస్ట్ స్పాట్లుగా , షూటింగ్ లొకేషన్లుగా చూడటం ఆధ్యాత్మిక విలువలను దిగజార్చడమే.
దేవునిపై భక్తి లేనప్పుడు వెళ్లడమెందుకు?
దేవుడిపై నిజమైన నమ్మకం ఉన్నవారు ఆ క్షేత్ర మర్యాదలను, ఆచారాలను గౌరవిస్తారు. కానీ, ఇక్కడ జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆరాధన కంటే ఆకర్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాలు పడేలా తప్పుడు పనులు చేస్తూ, దానిని భక్తిగా చిత్రీకరించడం సామాన్య భక్తుల సహనానికి పరీక్ష. టీటీడీ తీసుకున్న కఠిన చర్యలు భవిష్యత్తులో ఇలాంటి సోషల్ మీడియా భక్తులకు ఒక హెచ్చరికగా ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
