తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లాలో కమ్యూనిస్టుల మాదిరిగా భూ పోరాటానికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అందుకే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేద్దామని ఆమె పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పెన్షన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని .. రెండేళ్లు అయినా పట్టించుకోవడం లేదని కవిత అంటున్నారు. మానకొండూరులో ప్రభుత్వ భూమిలో ఉద్యమకారులతో కలిసి గుడిసెలు వేస్తామని, కమ్యూనిస్టుల తరహాలో భూ పోరాటం చేపడతామని ఆమె ప్రకటించారు.
డిసెంబర్ 9 నాటికి ఉద్యమకారులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆమె గతంలోనే డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో, జాగృతి జనంబాట యాత్రలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు ఈ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుట్టారు. అర్హులైన ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఇంటి స్థలం కేటాయించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. వయసు మళ్లిన ఉద్యమకారులకు నెలవారీ పెన్షన్ అందించాలని.. ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమకారులకు న్యాయం పేరుతో నేరుగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పోరాటం కేవలం కరీంనగర్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ఆమె చెబుతున్నారు. విమర్శలు వస్తాయని.. గతంలోనే ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనూ వారికి న్యాయం జరగలేదన్నారు.
