ఎంఎం కీరవాణి… ఆయన బాణీలోని విలక్షణత వ్యక్తిత్వంలోనూ కనిపిస్తుంది. ఆస్కార్ అవార్డ్ అందుకోవడం మంచి టీ తాగిన అనుభూతిని ఇచ్చిందని పోల్చడం ఆయన విలక్షణతకి నిదర్శనం. ఆస్కార్ అందుకున్న తర్వాత ఆయన నుంచి వస్తున్న తొలి సినిమాగా నిలిచింది నాగార్జున ‘నా సామిరంగ’. ఈ చిత్రం జనవరి14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కీరవాణితో స్పెషల్ చిట్ చాట్.
* ఆస్కార్ అందుకున్న తర్వాత వస్తున్న ఈ చిత్రం ఎంత స్పెషల్ ? ఆ హైప్ పని చేస్తుందా?
– ప్రతి సినిమాలనే వుంది. నిజానికి ఆస్కార్ తో సినిమాకి ఎలాంటి లాభం, ఉపయోగం వుండదు. నేను బాగా పాటలు కంపోజ్ చేయాలి. దర్శకుడు బాగా తీయాలి. ప్రేక్షకులు కనెక్ట్ కావాలి. అంతే.
* నాగార్జున గారితో చాలా రోజుల తర్వాత పని చేయడం ఎలా అనిపించింది ?
– ఆయనతో పని చేయడం నాకు అలవాటైన విద్య. ఒక్కసారి నమ్మితే మరో ఆలోచన లేని వ్యక్తి నాగ్. ఈ సినిమా ప్రెసిడెంటు గారి పెళ్ళాం చిత్రం లాంటి వైబ్ తో వుంది. మరో ప్రెసిడెంటు గారి పెళ్ళాం అవుతుందనే నమ్మకం వుంది.
* ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు?
– డబ్బు.. ఇంతకంటే ఆకర్షించే అంశాలు ఏముంటాయి.! (నవ్వులు)
* చాలా ఫాస్ట్ గా తీసినట్లు వున్నారు ?
-ఫాస్ట్ గా తీయడం వేరు.. చుట్టేయడం వేరు. ఇది మొదటి రకం. ఎక్కడా క్యాలిటీ తగ్గకుండా ఫాస్ట్ గా తీశాడు కొత్త దర్శకుడు బిన్నీ. తనలో పరిణతి కనిపించింది.
* ఇప్పుడు పాటలన్నీ వైరల్ అయితేనే హిట్ అంటున్నారు కదా ?
– నిజమే.. కానీ వైరల్ అనేది మన చేతిలో లేదు కదా.. ఒకప్పుడు బ్యాండ్ వాళ్ళు పాట వాయిస్తే హిట్.. ఇప్పుడు కుప్పలు తెప్పలుగా రీల్స్, వ్యూస్ వస్తే హిట్టు..మీడియం మారిందంతే.
* ఇంతకాలంగా మ్యూజిక్ చేస్తున్నారు. ఇంకా అప్డేట్ అవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా?
– అనిపించదు. నాతో పని చేస్తున్నంత వారంతా యువకులే. బహుసా నాలాంటి వయసుపై బడిన వారితో పని చేస్తే అలా అనిపిస్తుందేమో.
* ఈ మధ్య మీకు బాగా నచ్చిన సినిమాలు .. మ్యూజిక్ పరంగా?
– జైలర్ నేపధ్య సంగీతం నచ్చింది. అనిరుద్ కి మెసేజ్ కూడా పెట్టాను. యానిమల్ కూడా నచ్చింది.
* తెలుగు పాటలపై పాన్ ఇండియా ప్రభావం పడి తెలుగుదనం మిస్ అవుతున్న అనుభూతి కలుగుతుందా?
-మనం తినే తిండి, కట్టుకునే బట్టపైనే తెలుగుదనం లేదు. మనం ఎవన్నా తెలుగు నూడూల్స్ తింటూ, అచ్చతెలుగు జీన్స్ వాడుతున్నాం. మార్పు ప్రతిరంగంపై వుంటుంది.
*రాజమౌళి సినిమా ఎప్పుడు?
-కనుక్కుందామని ఫోన్ చేస్తే.. ఆఫ్ వస్తుంది. అంటే పని నా వరకూ ఇంకా రాలేదు. చిరంజీవి గారి సినిమా జరుగుతోంది. హరివీరమల్లు మూడు పాటలు రికార్డ్ చేశాం. క్రిష్ గారు డేట్స్ ఇస్తే మళ్ళీ మొదలుపెడతాం.
*ఆల్ ది బెస్ట్ అండీ
-థాంక్ యూ..