బీజేపీ వ్యూహం అదేనా…!

ఓ వైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ, మరో ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త సారథులు నియమితులయ్యారు. కీలకమైన తెలంగాణతో పాటు కర్ణాటక, యూపీ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ లకు కొత్త అధ్యక్షులను నియమించారు. తెలంగాణ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ నియమితులయ్యారు. కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా, గత రెండేళ్లలో తెలంగాణలో పార్టీ ఏమాత్రం పుంజుకున్న దాఖలాలు లేవు. కిషన్ రెడ్డి నాయకత్వంలో కొత్త జోష్ తో పనిచేస్తారని భావిస్తే అది జరగలేదు. ఇప్పుడు కొత్త సారథి అయినా పార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతారని భావిస్తున్నారు.

కర్ణాటకలో ఒకప్పుడు పక్కన పెట్టిన యడ్యూరప్పనే మళ్లీ దిక్కయ్యారు. ఆయన్ని ఆ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని చేశారు. దక్షిణాదిన తొలిసారిగా, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన్నే ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. చివరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. లింగాయత్ సామాజిక వర్గంలో పట్టున్న బలమైన నాయకుడు యడ్యూరప్పను మరోసారి పార్టీలో కీలకమైన వ్యక్తిగా గుర్తించారు. కర్ణాటకలో 2018 ప్రారంభంలో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ రెండేళ్లలో పార్టీని బలమైన శక్తిగా మలచడం అనే బాధ్యతను యడ్యూరప్పపై పెట్టారు.

పంజాబ్, యూపీల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ దృష్టితోనే కేంద్ర మంత్రి విజయ్ సంప్లాను పంజాబ్ శాఖ అధ్యక్షుడిగా నియమించారు. దళిత నాయకుడైన సంప్లాను వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. బాదల్ ప్రభుత్వంపై ఆ రాష్ట్రంలో రోజురోజుకూ అసమ్మతి పెరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే అకాలీదళ్ తో తెగతెంపులు చేసుకోవాలని పంజాబ్ బీజేపీలో పలువురు నేతలు భావిస్తున్నారు. అకాలీలతో పొత్తు ఉంటే మళ్లీ గెలవడం కష్టమని వారు పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

యూపీలోనూ అధికారంలోకి రాకపోయినా బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే అమేథీలో రాహుల్ గాంధీనిక ఓడించడానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు ప్రతి వారాంతంలో ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పనిలోపనిగా రాష్ట్రంలో కేడర్ ను ఉత్తేజ పరచడానికి కృషి చేస్తున్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే యూపీలో వీలైనన్ని ఎక్కు సీట్లు గెలవాలి. దానికి అసెంబ్లీ ఎన్నికల నుంచే బాటలు వేసుకోవాలనేది కమలనాథుల ప్లాన్. ఏది ఏమైనా అధికారంలోకి రావడం, వీలైనంత బలాన్ని పుంజుకోవడమే ఎజెండాగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోణంలో నిర్ణయాలను తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com