ప్రజలకు ఖర్చులతో పాటు పన్నులు పెరుగుతున్నాయి. ఆ అసహనం ప్రజల్లో కనిపిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలు తెస్తున్నామని దీపావళి నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రజల్లో పన్నులు తగ్గుతాయన్న ఆశ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ నాలుగు శ్లాబులు ఉన్నాయి. ఇక నుంచి కేవలం రెండు శ్లాబులు.. 5, 18 శాతం మాత్రమే ఉంటాయి. అన్ని వస్తువుల్ని ఈ రెండింటి కిందకు చేరుస్తారు. అత్యధికం 5 శాతం పన్ను పరిధిలో ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.
లగ్జరీ తప్ప అన్నీ 5 శాతం పన్ను పరిధిలోకి తెస్తే మేలు !
ప్రస్తుతం 24 శాతం వరకూ పన్ను పోటు ఉంది. ప్రజలు నిత్యావసరంగా వాడే వస్తువులపైనా అత్యధిక పన్ను రేటు ఉంటోంది. పన్ను శ్లాబుల వల్ల సాధారణ ప్రజలే కాదు వ్యాపారులూ ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడులో క్రీమ్ బన్ అంశంపై పెద్ద వివాదం రేగింది. క్రీమ్, బన్నుకు విడివిడిగా పన్నులు తక్కువ కానీ.. క్రీమ్ నన్ను కొంటే మాత్రం ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తోందని ఓ వ్యాపారి నేరుగా అర్థిక మంత్రిని ప్రశ్నించారు. దీనిపై సోషల్మీడియాలో చాలా ప్రచారం జరిగింది. ఇలాంటి ఎన్నో పన్ను శ్లాబుల్లో ఉన్నాయి. దీని వల్ల ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.
పెరిగిపోతున్న పన్నుల భారం
ఆదాయపు పన్ను కట్టే వాళ్లకు.. ఈ పరోక్ష పన్నులు అదనపు భారంగా మారాయి. పన్నుల మీద పన్నులు చెల్లించాల్సి వస్తోంది. పెట్రోల్ మీద మళ్లీ మరో రకం పన్నులు. ఇవి ప్రజల ఆదాయాన్ని పీల్చేస్తున్నాయి. వీటన్నింటినీ కాస్త సంస్కరించాల్సి ఉంది. నిత్యావసర వస్తువులు అమ్మేసూపర్ మార్కెట్ కు వెళ్తే.. ఎక్కువగా అత్యధిక పన్ను శ్లాబులే బిల్లు లో కనిపిస్తూంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్నులో కొంత రిలీఫ్ రావడంతో.. జీతాల మీద ఆధారపడేవాళ్లు కాస్త రిలీఫ్ ఫీలయ్యారు. జీఎస్టీ సంస్కరణల్లోనూ మేలు చేస్తే… ప్రధాని మోదీపై మధ్యతరగతి మరింత అభిమానం పెంచుకునే అవకాశం ఉంది.
జీఎస్టీ లక్షల కోట్ల ఆదాయం
జీఎస్టీ ద్వారా ప్రభుత్వాని లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. నెలకు లక్షన్నర కోట్లకుపైగానే వస్తోంది. ఇక పెట్రోల్, డీజిల్ తో పాటు ఇతర పన్నుల మీద వచ్చేది అదనం. ప్రజల నుంచి ఈ స్థాయిలో వసూలు చేయడం కన్నా.. కొంత భారం తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థ మరింత చురుకుగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే జీఎస్టీని సంస్కరణలపై కేంద్రం గట్టిగా కసరత్తు చేస్తోంది. దీపావళికి గుడ్ న్యూస్ వినిపిస్తే.. ప్రజలకు ఆనందంగా పండుగ చేసుకుంటారు.