తాజా సమాచారం ప్రకారం ఇకపై కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకి ఇచ్చే నిధులు, వాటిని దేనికోసం మంజూరు చేయబడ్డాయనే వివరాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్ధిక బడ్జెట్ లోనే స్పష్టం పేర్కొనాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది.
దేశంలో అన్ని రాష్ట్రాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి కేంద్రప్రభుత్వం ఏటా బారీగా నిధులు మంజూరు చేస్తూ ఉంటుంది. కానీ అదిస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత పధకాలు ప్రారంభించుకొని, కేంద్రం తగినన్ని నిధులు విడుదల చేయడం లేదని దుష్ప్రచారం కూడా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి మంత్రులు, నేతలు చేస్తున్న ఆరోపణలు విన్నట్లయితే ఆ విషయం అర్ధం అవుతుంది. దీని వలన కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకి తీవ్రనష్టం జరుగుతోంది. రాష్ట్రాలకి తగినన్ని నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలని కొనసాగిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న ఈ అతితెలివితేటల వలన, అన్ని రాష్ట్రాలలో భాజపా పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోంది.
దీనిని రాజకీయంగా అడ్డుకోవాలని భాజపా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర భాజపా నేతలు కేంద్రం ఇస్తున్న నిధులు, వాటితో అమలవుతున్న వివిధ పధకాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలని గట్టిగా నిలదీస్తున్నారు. కానీ రెండు రాష్ట్రాలలో కొన్ని హామీలు, పెండింగ్ సమస్యలని పరిష్కరించడంలో చాలా జాప్యం జరుగుతుండటంతో మంత్రులు, అధికార పార్టీ నేతలు రాష్ట్ర భాజపా నేతలపై గట్టిగా ఎదురుదాడి చేస్తున్నారు. భాజపాయేతర రాష్ట్రాలలో అన్ని చోట్ల ఇంచుమించు ఇటువంటి సమస్యే ఎదుర్కొంటోంది.
కనుక ఈ సమస్యకి కేంద్రప్రభుత్వం ఈవిధంగా చాలా చక్కటి పరిష్కారం కనుగొంది. రాష్ట్ర బడ్జెట్ లోనే కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులు, వాటితో రాష్ట్రంలో అమలవుతున్న వివిద పధకాలని పేర్కొనడం అనివార్యం అయితే, అదొక అధికారిక ప్రకటన, అదే ఒక అధికారిక డాక్యుమెంట్ అవుతుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా ప్రకటించవలసి వస్తుంది. కనుక ఇక రాష్ట్ర ప్రభుత్వాలు…వాటిని నడిపిస్తున్న ప్రాంతీయ పార్టీలు కేంద్రప్రభుత్వాన్ని నిధులు ఇవ్వడం లేదని నిందించలేవు. అది ఇస్తున్న నిధులతో తమ స్వంత పధకాలు నడిపించుకోలేవు. అప్పుడు ప్రజలని ఆకట్టుకొనేందుకు లేదా వారికి ఇచ్చిన హామీలని నిలబెట్టుకొనేందుకు తప్పనిసరిగా తమ స్వంత పధకాలకి స్వయంగా నిధులు సమకూర్చుకోవలసి వస్తుంది. ఆ విషయం కూడా బడ్జెట్ లో విస్పష్టంగా పేర్కొనవలసి వస్తుంది.
దీనితో నీళ్ళకి నీళ్ళు పాలకి పాలు వేరయిపోయినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఏమేమి పధకాలు అమలుచేస్తున్నాయి, వాటికి అవి ఎంతెంత నిధులు మంజూరు చేస్తున్నాయనే విషయం కళ్ళకి కట్టినట్లు కనబడుతుంది. కేంద్రప్రభుత్వం చాలా అద్భుతమైన ఆలోచనే చేసిందని చెప్పక తప్పదు. కానీ దీనితో రాష్ట్ర ప్రభుత్వాల ఆటకట్టయిపోతుంది. కనుక ఈ ప్రతిపాదనని అవి స్వాగతించవని చెప్పవచ్చు కానీ అవి ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.