యూరీ ఘటన స్వయంకృతాపరాదమేనా?

ఇప్పుడు యూరీ ఉగ్రవాదుల దాడులపై చాలా తీవ్రంగా స్పందిస్తున్న మోడీ ప్రభుత్వం, పఠాన్ కోట్ ఉగ్రవాద దాడుల కేసుని నీరుగార్చేసినందునే, పాకిస్తాన్ మళ్ళీ ఇంతగా పెట్రేగిపోతోందని చెప్పకతప్పదు. భారత్-పాక్ మధ్య దశాబ్దాల క్రితం జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని అమలుచేయకపోతే దానిని యుద్ద ప్రకటనగానే భావిస్తామని పాకిస్తాన్ భారత్ ని హెచ్చరించుతోంది. కానీ భారత్ కి వ్యూహాత్మకమైన పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేస్తే దానిని భారత్ పై యుద్ధంగా భావించలేదు కనీసం ఆవిధంగా స్పందించలేదు కూడా. పైగా భారత సైనికులని పొట్టన పెట్టుకొన్న పాకిస్తాన్ తోనే ఆ తరువాత క్రికెట్ మ్యాచ్ లు కూడా ఆడింది. పాక్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులకి భారత్ హాజరయ్యింది కూడా.

భారత ప్రభుత్వం యొక్క ఈ చర్యలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీరజవాన్లని అవమానపరచడమేనని చెప్పక తప్పదు. కానీ యూరీ దాడుల నేపధ్యంలో పఠాన్ కోట్ కేసుని మోడీ ప్రభుత్వం ఎందుకు నీరుగార్చేసింది?అనే ప్రశ్నకి సమాధానం ఇప్పుడు వెతుకక తప్పదు.

వేర్పాటువాదులకి మద్దతు పలికే పిడిపితో కలిసి జమ్మూ కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వంలో భాజపా కొనసాగుతున్నందున, బహుశః పిడిపి ఒత్తిడి కారణంగానే మోడీ ప్రభుత్వం పఠాన్ కోట్ కేసుని నీరుగార్చి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ పఠాన్ కోట్ వ్యవహారంలో మోడీ ప్రభుత్వం చాలా ఉదాశీనంగా వ్యవహరించినందునే నేడు పాకిస్తాన్ ఇంత సాహసానికి పూనుకోగలిగిందని చెప్పక తప్పదు.

కనుక ఇప్పుడు యూరీ దాడుల విషయంలో మోడీ ప్రభుత్వం చాలా చురుకుగా, వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని చాలా ఇరుకున పెడుతున్నప్పటికీ, మళ్ళీ రేపు సరిగ్గా అదే కారణంతో ఈ కేసుని కూడా నీరుగార్చకుండా ఉంటుందా? అని అనుమానం కలగడం సహజం. ఆ అనుమానానికి ఇంకా మరో కారణం కూడా కనబడుతోంది.

కాశ్మీర్ లో సుమారు రెండున్నర నెలలపాటు అల్లర్లు కొనసాగి, వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తరువాత గానీ మోడీ ప్రభుత్వం కలుగజేసుకోలేదు. అంతకాలం ఎందుకు కలుగజేసుకోలేదు? అంటే పైన చెప్పుకొన్న కారణమే. కానీ కేంద్రం కలుగజేసుకొన్న తరువాత కాశ్మీర్ లో పరిస్థితులు చాలా వేగంగా సాధారణ స్థితికి చేరుకొన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ చెదురుముదురు అల్లర్లు జరుగుతున్నప్పటికీ, ఇదివరకుతో పోలిస్తే కాశ్మీర్ ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది. పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

వారం-పది రోజుల వ్యవధిలో కాశ్మీర్ లో ఇంత మార్పు ఎలాగ సాధ్యం అయ్యింది? అంటే వేర్పాటువాదులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజీపడటం వలననే తప్ప మంత్రదండం తిప్పడం వలన కాదని అందరికీ తెలుసు. అంటే కాశ్మీర్ లో శాంతి వేర్పాటువాదులు దయాదాక్షిన్యాలపైనే ఆధారపడి ఉంది తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమర్ధతపై కాదనే అభిప్రాయం కలుగుతోంది. కనుక యూరీ ఘటనలపై భారత్ ఇంకా దూకుడు పెంచితే మళ్ళీ వేర్పాటువాదులు కాశ్మీర్ లో సమస్యలు సృష్టించి మోడీ ప్రభుత్వాన్ని కాళ్ళబేరానికి రప్పించుకొనే అవకాశం ఉన్నట్లు భావించవచ్చు. కనుక యూరీ కేసుని కూడా మోడీ ప్రభుత్వం మున్ముందు నీరుగార్చినా ఆశ్చర్యం లేదు.

భారత ప్రభుత్వం యొక్క ఈ బలహీనతని పాకిస్తాన్ కూడా గ్రహించబట్టే అది మళ్ళీ మళ్ళీ అంత సాహసానికి పూనుకోగలుగుతోందని చెప్పక తప్పదు. భారత్ ఈ బలహీనతని జయించాలంటే, ముందుగా ఇందుకు మూలకారణమైన కరడుగట్టిన కాశ్మీర్ వేర్పాటువాదులని అందరినీ మోడీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా ఏరిపారేయాలి. అప్పుడే పాకిస్తాన్ కాశ్మీర్ లో కాలు,వేలు పెట్టే సాహసం చేయకుండా నిలువరించగలుగుతాము.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com