ఉపరాష్ట్రపతి జగదీప్ థన్ఖడ్ రాజీనామా వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు రాజీనామా అనే ఆలోచన ఉందని బయట ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకూ సభను నిర్వహించి ఆ తర్వాత వెంటనే రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలు అని చెప్పినప్పటికీ ఏదో జరిగిందని చాలా మందికి అర్థమవుతోంది. అదేమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు.
ఏరి కోరి ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన మోదీ
నాలుగేళ్ల క్రితం వెంకయ్యనాయుడు పదవి కాలం ముగిసిన తర్వాత ఎవరు ఉపరాష్ట్రపతి అనే అంశంపై అనేక చర్చలు జరిగాయి. నిజానికి ఈ చర్చలన్నీ బయటే జరిగాయి. బీజేపీ హైకమాండ్ లో ఎలాంటి చర్చలు జరిగాయో ఎవరికీ తెలియదు. అనేక మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ థన్ఖడ్ను మోదీ ఖరారు చేశారు. ఆయన బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వంతో ఓ ఆట ఆడుకున్నారు. సామాజిక సమీకరణాలు చూశారో.. ఆయన దూకుడు నచ్చిందో కానీ ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పించేశారు.
హఠాత్తుగా రాజీనామా చేయించిన వైనం
ఆరోగ్య కారణాలతోనే ధన్ఖడ్ రాజీనామా చేశారు అంటే ఎవరూ నమ్మడం లేదు. రాజకీయ నేతలకు అనారోగ్యం అయినా పదవులు ఊడిపోవు. కోమాలో ఉన్నా పదవులు అనుభవిస్తూనే ఉంటారు. ఉదయం అంతా గట్టిగా రాజ్యసభను నిర్వహించిన ధన్ఖడ్ అప్పటికప్పుడు రాజీనామా చేయాల్సినంత హెల్త్ ఎమర్జెన్సీ లేదు. కానీ ఆయన రాజీనామా చేసేశారు అంటే.. ఖచ్చితంగా పై స్థాయిలో వచ్చిన ఆదేశాలే అనుకోవచ్చు. న్యాయవ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు.. రాజ్యసభలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాలు కూడా కారణం కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూంటారని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అయితే విపక్షాల ఆరోపణల కారణంగా ఆయనతో రాజీనామా చేయించే అవకాశం ఉండదు.
దక్షిణాది నేతకు చాన్స్ ఇస్తారా ?
సాధారణంగా దేశ ఉన్నత పదవుల్లో దక్షిణాది నేతకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ప్రధానిగా ఉత్తరాది నేత ఉంటే.. రాష్ట్రపతిగా దక్షిణాదికి అవకాశం కల్పిస్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అలాంటి సంప్రదాయం పాటించడం లేదు. అన్నీ ఉత్తరాదికే వెళ్తున్నాయి. చివరికి ఓ సారి వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి.. తర్వాత మళ్లీ ఉత్తరాదికే ఇచ్చారు. ఇంకా రెండేళ్ల పదవి కాలం ఉన్న ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాదికే కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మోదీ, షా మనసుల్లో ఏముందో కానీ.. ఉపరాష్ట్రపతి రాజకీయం మాత్రం.. ఎవరూ ఊహించనిది.. కారణాలు కూడా బయటకు రావడం చాలా కష్టం.