ప్రొ.నాగేశ్వర్ : మోడీని బీసీ కార్డు కాపాడుతుందా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఇప్పుడు బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. తాను వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తినయినందునే… తనను టార్గెట్ చేస్తున్నారని… పదే పదే ప్రచారసభల్లో చెబుతున్నారు. మోడీకి ఇదో ప్రచారాస్త్రంగా మారిపోయింది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులం గురించి మాట్లాడటం… తన కులం వల్ల తనను విమర్శిస్తున్నారని చెప్పుకోవడం… విమర్శలకు కారణం అవుతోంది.

మోడీని విమర్శిస్తే బీసీలందర్నీ విమర్శించినట్లా..?

చంద్రబాబునాయుడుని విమర్శిస్తే కమ్మవాళ్లందర్నీ, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే.. రెడ్లందర్నీ.. అలాగే కేసీఆర్‌ను విమర్శిస్తే.. వెలమలందర్నీ విమర్శించినట్లు కాదు కదా..! అలాగే.. దళిత, గిరిజన నేతల్ని విమర్శిస్తే.. అది వారిని విమర్శించినట్లవుతుంది కానీ.. వారు కులం మొత్తాన్ని విమర్శించినట్లు కాదు కదా..! ఓ భారత ప్రధాని.. తనపై వస్తున్న విమర్శలను కాచుకోవడానికి కులం వెనుక దాక్కునే ప్రయత్నం చేయడం.. కులం అంశాన్ని తెరపైకి తీసుకు రావడం… భారత ప్రజాస్వామ్యానికే దుర్దినం. భారత ప్రధాని అనే పోస్టు అత్యున్నమైనది. కులం , మతం, ప్రాంతం అనే భావనలకు అతీతంగా ఉండాలి. అందుకే అందరూ గౌరవిస్తారు. కానీ అలాంటి ప్రధాని ఇప్పుడు .. కులం ప్రకారం ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న నేతలందర్నీ అందరూ విమర్శిస్తూనే ఉంటారు. మోడీ చెప్పిన సూత్రం ప్రకారం… ఇప్పుడు ఎవరూ ఎవర్నీ విమర్శించినా.. అది వారి కులాల మొత్తాన్ని విమర్శించినట్లు అవుతుంది. అంత ఎందుకు.. బీజేపీ నేతలు ఎవరిపైనా విమర్శలు చేయడం లేదా..? సోనియా గాంధీపై రోజూ విమర్శలు చేస్తున్నారు. అంటే.. మహిళలందరిపైనా విమర్శలు చేస్తున్నట్లేనా..? . మోడీ కూడా రాహుల్ గాంధీని రోజూ విమర్మిస్తారు. తాను దత్తాత్రేయ గోత్రీకుడినైన బ్రాహ్మణుడినని.. రాహుల్ చెప్పారు. అంటే.. మోడీ బ్రాహ్మణులందర్నీ విమర్శించినట్లేనా..?

కులం కాపాడుతుందనే దశకు మోడీ వెళ్లిపోయారా..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. నీరవ్ మోడీ, లలిత్ మోడీ లతో పాటు నరేంద్రమోడీల పేర్లు చెప్పి.. దొంగలన్నారు. మోడీ అనే కులం మొత్తం దొంగలని రాహుల్ చెప్పలేదు. ఇది క్లియర్ గా ఉంటుంది. ఇదో పొలిటికల్ ఇంప్రెషన్. దీన్ని వదిలేసి… మొత్తం కులానికి అపాదించి రాజకీయం చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కూడా.. నరేంద్రమోడీ అదే తరహా ప్రచారం చేశారు. ఓ సందర్భంలో చేసిన విమర్శలను కులానికి అంటగట్టారు. తన కులాన్ని నీచమైన కులం అన్నారని ప్రచారం చేసుకున్నారు. ఇంత వరకూ మోడీని కులం పేరుతో తిట్టిన వాళ్లెవరూ లేరు. ఆయనను బీజేపీ నేతగా ఆయనను విమర్శించి ఉంటారు. ఆయన భారత ప్రధాని. ఆయన ప్రధానిగా ఉడాలనుకుంటున్నాం. ఆయన కుల సంఘ ప్రతినిధి అయితే … ఆయను విమర్శిస్తే.. అప్పుడు.. కులం గురించి చెప్పినా అర్థం ఉంటుంది. కానీ మోడీ కుల సంఘ ప్రతినిధి కాదు కదా..! తనను తాను సమర్థించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు.. కులమే రక్షణ అన్నట్లుగా… నరేంద్రమోడీ వ్యవహరిస్తున్నారు.

పడిపోయిన రాజకీయ విలువలకు మోడీ మాటలే సాక్ష్యం..!

ప్రధానమంత్రి స్థాయిలో ఉండి.. కులం కార్డు వాడుకోవడం అనేది.. రాజకీయ అసహనానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. బీజేపీని విమర్శిస్తే దేశభక్తి లేనట్లు.. మోడీని విమర్శిస్తే… భారత్‌ను విమర్శించినట్లు.. మోడీని ప్రశ్నిస్తే.. పాకిస్తాన్ ఏజెంట్లు అన్నట్లు… అలాగే.. ఇప్పుడు మోడీని ప్రశ్నిస్తే వెనుకబడిన కులాలను విమర్శించినట్లు… ప్రచారం చేసుకోవడం రాజకీయ దిగజారుడు తనమే. మోడీని అందరూ భారత రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు తప్ప.. కుల నాయకుడిగా కాదు. ఆయన కులం ఏమిటో ఎవరికి తెలుసు..? దేశంలో మోడీ కులం ఏమిటో తెలిసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అయినా.. తనకు వచ్చిన సమస్యను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కులం వెనుక దాక్కోవడం… దిగజారిన రాజకీయ ప్రమాణాలను చూపిస్తోంది. మోడీ బలమైన రాజకీయ నేత. ఆయన కూడా.. తనను.. రాజకీయంగా ఎవరూ కాపాడలేరు. తనను కులమే కాపాడుతుందని.. ఆయన అనుకుంటే.. అది రాజకీయంగా… దేశంలో పరిస్థితులు దిగజారిపోయినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com