తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన రెండేళ్ళ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ రేపు మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రానికి వస్తున్నారు. కానీ అక్కడ అయన గడిపేది కేవలం మూడున్నర గంటలు మాత్రమే. దానిలో తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల కోసం కేవలం 1.15గంట సేపు మాత్రమే సమయం కేటాయించారు. రేపు మధ్యాహ్నం 3.00 గంటలకి గజ్వేల్ చేరుకొని అక్కడి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని సాయంత్రం 4.15కి హైదరాబాద్ వెళ్లిపోతారు. అక్కడ రాష్ట్ర భాజపా నేతలతో సమావేశం అయ్యి రాష్ర్టంలో భాజపా పరిస్థితిని సమీక్షిస్తారు. ఆ సమావేశం ముగియగానే రాత్రి 7.00 గంటలకి మళ్ళీ డిల్లీ బయలుదేరుతారు.
దేశప్రధానిగా ఆయనకి అనేక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది కనుక తెలంగాణా రాష్ట్రానికి అంత తక్కువ సమయం కేటాయించినందుకు ఆయనని తప్పు పట్టలేము కానీ ఆయన తెలంగాణా రాష్ట్రానికి కంటే భాజపాకే ఎక్కువ సమయం కేటాయించడమే జీర్ణించుకోవడం కష్టం.
అయన రేపు మధ్యాహ్నం 3.00గంటలకి హైదరాబాద్ నుంచి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులతో కలిసి హెలికాఫ్టర్ లో గజ్వేల్ చేరుకొని అక్కడ మిషన్ భగీరథ పధకాన్ని ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న బహిరంగసభలో ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు.
అంతవరకు బాగానే ఉంది. కానీ కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించబోయే 1,600 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి, అదే జిల్లాలో మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైనుకు మెదక్ జిల్లాలోని గజ్వేల్లో శంఖుస్థాపన చేయబోవడం చాలా విడ్డూరంగా ఉంది. అదొక్కటే కాదు రామగుండంలో పునః ప్రారంభించబోతున్న ఎరువుల కర్మాగారానికి, వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి గజ్వేల్లోనే శిలాఫలకాలు వేయడం ఇంకా విచిత్రంగా ఉంది. అంతేకాదు.. ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ లో నిర్మించబడిన 1,200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని కూడా అక్కడి నుంచే ‘మమ’ అనిపించేస్తారు.
ఈ కార్యక్రమాలన్నిటికీ ఆయా జిల్లాలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంఖుస్థాపన, శిలా ఫలకాలు వేయించాలాని తెలంగాణా ప్రభుత్వం చాలా ఉబలాటపడింది..ప్రయత్నించింది కానీ ఆయన సమయం కేటాయించకపోవడం వాటన్నిటినీ ఒకే వేదికపై నుంచే పూర్తి చేయంచవలసి వస్తోంది.
ఆ కార్యక్రమాలకి ఆయన సమయం కేటాయించనప్పుడు, వాటిని ఆయన చేతే గజ్వేల్ ల్లో చేయించడం కంటే, తెలంగాణా ప్రభుత్వమే అర్హులైన వ్యక్తులతో వాటి నిర్దిష్ట ప్రదేశాలలోనే చేయించి ఉండి ఉంటే బాగుండేది. వరంగల్లో నిర్మించబోయే హెల్త్ యూనివర్సిటీకి మెదక్ జిల్లాలో శంఖుస్థాపన చేయవచ్చనుకొన్నప్పుడు, అదేదో డిల్లీలోనే చేసేస్తే సరిపోయేది కదా. ఆయనకి ఈ శ్రమ కూడా ఉండేది కాదు అని ప్రజలు, ప్రతిపక్షాలు అనకుండా ఉంటారా?