నా మిత్రుడు మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా. త్వరలో మాట్లాడతానను అని ట్రంప్ కొద్ది రోజుల కిందట ప్రకటించారు. ఇప్పుడు మోదీ పుట్టిన రోజు సందర్భంగా విష్ చేయడానికి ట్రంప్ ఫోన్ చేశారు. ఇంత కాలం ఫోన్లు ఎత్తలేదని ప్రచారం జరుగుతున్నా.. ఈ సారి మాత్రం మోదీ ఫోన్ లిఫ్ట్ చేసి ట్రంప్ ఇచ్చిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ ట్వీట్ల ద్వారా బయట ప్రపంచానికి తెలిపారు. అంత వరకూ బాగానే ఉంది. మరి టారిఫ్లు సంగతేంటి అన్నది సగటు భారతీయుడి సందేహం.
భారత్ తో ట్రేడ్ చర్చలకు వచ్చిన అమెరికా ప్రతినిధి
భారత్ తో వాణిజ్య చర్చల కోసం అమెరికా ప్రతినిధి ఇండియాకు వచ్చారు. మంగళవారం అంతా విస్తృతంగా చర్చలు జరిపారు. ఫలితం ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. ఈ లోపు మోదీ, ట్రంప్ మాట్లాడుకున్నారు. వారేం మాట్లాడుకున్నా.. వారి వారి దేశాల ప్రయోజనాలను కాదని.. ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేరు. కింది స్థాయిలో జరిగిన చర్చల సారాంశంలో సానుకూల అంశాలు ఉంటేనే ఒప్పందం కుదురుతుంది. అందుకే తమ ట్వీట్లలో టారిఫ్ల అంశాన్ని వెల్లడించలేదు. కానీ ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని మాత్రం ప్రస్తావించారు.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఇండియా ఆపేస్తుందన్న అర్థంలో ట్రంప్ ట్వీట్
ట్రంప్ ట్వీట్ లో.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి సహకరించిన నరేంద్రకు ట్రంప్ ధ్యాంక్యూ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో భారత్ పాత్ర ఏమీ లేదు. కానీ అమెరికా ఉద్దేశం ప్రకారం ఇండియా కొనుగోలు చేస్తున్న ఆయిల్ వల్లనే రష్యా యుద్ధం చేయడానికి నిధులు సమకూరుతున్నాయి. ఆ ఆయిల్ కొనడం ఆపేస్తే రష్యా కూడా యుద్ధం ఆపేస్తుంది. ఇప్పుడు ట్రంప్ అదే అర్థంలో ట్వీట్ చేశారు. నిజంగా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తుందా లేదా అన్నది మాత్రం స్పష్టత లేదు.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సాయం చేస్తామన్న మోదీ
ట్రంప్ తో ఫోన్ కాల్ అనంతరం మోదీ కూడా ట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్ లో రష్యా ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తామని మాత్రం చెప్పారు. ఇక్కడ ఆయిల్ కొనుగోలు అంశంలో భారత్ తన ఆలోచన మార్చుకుందా లేదా అన్నది మాత్రం స్పష్టత లేదు.
అయితే ఈ ట్వీట్ల వల్ల ఏం కాదు. అధికారికంగా తీసుకునే నిర్ణయాలే కీలకం. అందుకే ఏం నిర్ణయం తీసుకున్నారు.. టారిఫ్లపై ఏం చేస్తారన్నదానిపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


