ఈ దశాబ్దం మోదీదే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ చెబుతున్నారు. ఏ ఉద్దేశంతో ఆయన అలా అంటున్నారో కానీ ఈ దశాబ్దంలో మోదీని ఏ విషయంలోనూ ఓడించేవారే కనిపించడం లేదు. బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణ. సాధారణంగా ఓ ప్రభుత్వం పదేళ్లు ఉంటే… ప్రజలు అసంతృప్తితో తర్వాత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా ఓడించేంత అసంతృప్తి పెంచుకుంటున్నారు. కానీ మోదీ విషయంలో..బీజేపీ విషయంలో అలాంటిదేమీ ఉండటం లేదు. రాష్ట్రాల్లో కేంద్రంలో నిరాటంకంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అలా సాధ్యం కాని చోట మిత్రపక్షాలతో కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన వ్యూహాల ముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు.
మోదీకి సరైన రాజకీయ ప్రత్యర్థి లేకపోవడమే బలం
మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా దేశ ప్రజల ముందు ప్రొజెక్ట్ అయ్యే నాటికి కాంగ్రెస్ నాయకత్వం నిర్వీర్యం అయిపోయింది. మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానిగా ఉన్నా ఆయనను కాంగ్రెస్ ను బలపరచలేదు. ఎందుకంటే ఆయనే బలహీన ప్రధాని. అంతా సోనియానే చక్కబెట్టారు. సోనియా అనారోగ్యంతో రాజకీయాలకు దూరమయ్యారు. కానీ రాహుల్ ను నాయకుడిగా తీర్చిదిద్దలేకపోయారు. ఆయన చుట్టూ ఉండేవారి నిర్వాకాలతో ఆయనకు ఏమీ తెలియదని అందరికీ క్లారిటీ వచ్చింది. మోదీ వంటి నాయకుడికి ఎదురొడ్డి నిలిచే నాయకుడు కాదని.. సమస్యలు వచ్చినా పారిపోయే ఆయన మనస్థత్వమే నిరూపించింది. దాంతో బీజేపీకి తిరుగులేకుండా పోయింది.
మోదీకి బదులుగా రాహుల్ ను ఎంచుకోలేకపోతున్న దేశ ప్రజలు
మోదీ నాయకత్వ సామర్థ్యన్ని నిరూపించుకున్నారు. దేశం ఆయన నాయకత్వంలో పురోగతిలో ఉందన్నది నిజం. బీజేపీ తరహా రాజకీయాలకు వ్యతిరేకమైన వారు తీవ్రంగా విబేధించవచ్చు. ప్రజాస్వామ్యంలో అది సహజమే. కానీ మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు కూడా రాహుల్ ను నాయకుడిగా అంగీకరించలేకపోతున్నారు. ఆయన తీరుపై వారు సంతోషంగాలేరు. సమర్థతను నమ్మలేకపోతున్నారు. తాను సమర్థుడినేనని రాహుల్ నిరూపించుకోలేకపోతున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా ఆయన పరాజయం పాలవుతున్నారు. అయ్యేపాపం అని ప్రజలు ఎప్పుడైనా దయతలిచి అధికారం ఇస్తారని ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆయన చేసే రాజకీయాలతో అలాకూడా అనిపించకుండా చేసుకుంటున్నారు.
మోదీకి రాహుల్ సరిపోరు.. ఇంకెవర్నీ ఎదగనీయలేదు…!
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని వారుసుడిగా ప్రొజెక్ట్ చేసి బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆయనకు చేతకావడం లేదు. ప్రజలు అంగీకరించడం లేదు. అదే మోదీకి, బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. రాహుల్ వల్ల కావడం లేదు..మరి మోదీకి ప్రత్యామ్నాయంగా ఎవరు అంటే.. అలాంటి నేతే దేశంలో కనిపించకుండా పోయారు. ఎవరూ మోదీకి ఎదురెళ్లడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో.. మోదీ రిటైరయ్యాకే ఇతరులు ఆ స్థానం కోసం చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి అయినా గెలుపు అవకాశాలు లేనట్లే. రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉండే స్థాయి త్వరలో కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది !


