తెలంగాణ క్యాబినెట్లో మైనారిటీ కోటాలో చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక క్లాసిక్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల గడువు అంటే ఏప్రిల్ 30, 2026 నాటికి ఏదో ఒక సభలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సభ్యుడిగా ఉండాలి. కానీ, ఆ గడువు సమీపిస్తున్నా సభ్యత్వం మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోవడంతో, అజార్ వికెట్ పడటం ఖాయమేనా అన్న చర్చ జోరందుకుంది.
రాజ్యాంగ సంకటం
ఆర్టికల్ 164(4) ప్రకారం, సభలో సభ్యుడు కాకుండా మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి ఆరు నెలల లోపు ఎన్నికవ్వాలి. అజారుద్దీన్ గడువు ఈ ఏప్రిల్ 30తో ముగియనుంది. ఇప్పుడు ఉన్న ఏకైక దారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేషన్. గతంలో పంపిన ఫైల్‌ను అప్పటి గవర్నర్ పక్కన పెట్టారు. నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కొత్త గవర్నర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. అయితే, ఈ ఫైల్ ఆమోదం పొందితే తప్ప అజార్ మంత్రిగా కొనసాగే అవకాశం లేదు.
గవర్నర్‌తో రేవంత్ సన్నిహిత సంబంధాలు
సీఎం రేవంత్ రెడ్డి కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సఖ్యతగా ఉంటూ పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయించుకోవాలని చూస్తున్నారు. కానీ, ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌కు అంత సులభంగా ఊరటనిస్తుందా అన్నది సందేహం. సుప్రీంకోర్టు కూడా గవర్నర్ దే నిర్ణయం అని తేల్చి చెప్పింది. తమ దగ్గర జరుగుతున్న విచారణ గవర్నర్ నిర్ణయానికి ఆటంకం కాదని స్పష్టం చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజహర్‌ను ఖరారు చేస్తూ ఏప్రిల్ 30 లోపు గవర్నర్ సంతకం చేయకపోతే, అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. అదే జరిగితే, పాపం అజార్.. వచ్చిన పదవి ఆరు నెలలకే పోయింది అని సానుభూతి చూపడం తప్ప కాంగ్రెస్ శ్రేణులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది.
రేవంత్ రెడ్డి ఫైనల్ ఓవర్ బ్యాటింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ ఒక ట్రంప్ కార్డ్ లాంటి వారు. మైనారిటీ ప్రాతినిధ్యం కోసం ఆయనను కేబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పదవిని కాపాడటం రేవంత్ రెడ్డికి ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారింది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలను ఒప్పిస్తారా లేక గవర్నర్‌ను ప్రసన్నం చేసుకుంటారా అన్నది చూడాలి. సమయం తక్కువగా ఉంది, ప్రత్యర్థి చేతిలోనే అసలైన పవర్ ఉంది. ఈ రాజకీయ మ్యాచ్ లో అజార్ తన మంత్రి పదవిని కాపాడుకుంటారో లేక క్లీన్ బౌల్డ్ అవుతారో ఈ నెల చివరికల్లా తేలిపోనుంది. కాపాడుకోలేకపోతే అది కెప్టెన్ రేవంత్ వైఫల్యమే అవుతుంది.
