మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం చట్టబద్ధమేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువ మంది నుంచి వస్తున్నాయి. రాజ్యాంగ విరుద్ధమని ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని బీఆర్ఎస్ , బీజేపీ ఫిర్యాదులు చేశాయి. ఆ ఫిర్యాదులను సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఇప్పుడు నిర్ణయం రావాల్సి ఉంది. నిజానికి ఇది ముఖ్యమంత్రి విచక్షణాధికారం. మంత్రుల్ని ఉంచుకోవాలో.. తీసేయాలా అన్నదానికి ఎన్నికల కోడ్ తో సంబంధం ఉండదు. కానీ నైతికంగా ఆలోచిస్తే మాత్రం ఇది ఎన్నికల ప్రయోజనం కోసం చేస్తున్నదే కాబట్టి ఈసీ నిర్దేశం చేయవచ్చు.
గతంలో గోవాలో ఇదే అంశంపై వివాదం
గతంలో గోవాలో ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలో గోవా సీఎంగా ఉన్న మనోహర్ పారీకర్ మంత్రివర్గాన్ని విస్తరించాలని అనుకున్నారు. కానీ ఈసీ అభ్యంతరం చెప్పింది. కానీ పారీకర్ వినలేదు. తన రాజ్యాంగపరమైన హక్కును తాను వినియోగించుకుంటానని అడ్డం చెప్పడానికి ఈసీ ఎవరు అని ఆయన ఎదురుతిరిగారు. 2012లో కోర్తలిం అసెంబ్లీ బైపోల్ ముందు పారీకర్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని, మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్సింహ్ రానే భార్య అలీనా సల్దాన్హా ను మంత్రిగా చేర్చాలని ప్రణాళిక వేశారు. అలీనా భర్త మార్చ్ 2012లో మరణించిన తర్వాత కోర్తలిం సీటు ఖాళీ అయింది. ఆమె ఆ స్థానంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే పోటీ చేస్తున్న అభ్యర్థినే మంత్రిని చేయాలనుకున్నారు.
అభ్యంతరం చెప్పిన ఎన్నికల సంఘం
ECI పారీకర్‌కు అలీనాతో మంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని బైపోల్ పూర్తయ్యే వరకు వాయిదా వేయమని సలహా ఇచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ఇది “లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్”ను డిస్టర్బ్ చేస్తుందని, ఓటర్లపై ప్రభావం చూపుతుందని చెప్పింది. ఇది కోడ్ ఉల్లంఘనగా స్పష్టం చేసింది. పారీకర్ ఆర్టికల్ 164 ప్రకారం మంత్రివర్గ విస్తరణ తన హక్కు అని వాదించారు. కొన్ని రోజుల పాటు గోవా ప్రభుత్వం, ECI మధ్య వాదోపవాదాలు జరిగాయి. పారీకర్ వాదనను ఈసీఐ అంగీకరించినా.. కోడ్ సుప్రీమ్ అని చెప్పి ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయాల్సిందేనని స్పష్టం చేసింది. పారీకర్ ఈ నిర్ణయాన్ని అంగీకరించారు. ప్రమాణ స్వీకారాన్ని ఆపేశారు. ఆ ఉప ఎన్నికల్లో అలీనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల్లో లబ్ది కోసమే అజహర్‌కు మంత్రి పదవి !
ఎన్నికల్లో లబ్ది కోసమే అజహర్‌కు మంత్రి పదవి ఇస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయం. అందుకే అజహర్ ప్రమాణ స్వీకారంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కానీ గోవా అంశానికి.. ప్రస్తుతం జరుగుతున్న అంశానికి ఒక్క అంశంలో తేడా ఉంది. అదేమిటంటే.. గోవాలో ఉపఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతతోనే మంత్రిగా ప్రమాణం చేయించాలని పారీకర్ అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం అజహర్ అభ్యర్థి కాదు. ఇదొక్కటి తేడా ఉంది కాబట్టి ఎన్నికల సంఘం.. ఎన్నికలను ప్రభావితం చేసే కారణం కాదని చెప్పి.. అనుమతి ఇవ్వడానికి అవకాశం ఉంది. అభ్యంతరం చెప్పకపోవడానికి అవకాశం ఉంది. ఒక వేళ అభ్యంతరం చెబితే మాత్రం ప్రమాణ స్వీకారం వాయిదా పడుతుంది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                