ఇంగ్లాండ్-ఇండియా టెస్ట్ సిరీస్ ఒక బ్లాక్ బస్టర్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించింది. ఐదు టెస్ట్ మ్యాచుల్లో బోలెంత యాక్షన్ చోటు చేసుకుంది. ఇరు జట్లు ఎక్కడా తగ్గలేదు. ఇంగ్లిష్ జట్టు అహంకారం చూపిస్తే.. తగ్గదేలే అన్నట్టు ఇండియా ఆటగాళ్లు ఎదురుతిరిగారు. యువ కెప్టెన్ గిల్.. ఓవర్స్ ఆడకుండా తప్పించుకుంటున్న ఇంగ్లిష్ బ్యాటర్‌ని ”కొన్ని బాల్స్ ఆడే దమ్ములేదా?” అనే కామెంట్ చేయడం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి గొప్ప కిక్ ఇచ్చింది. ఇరు జట్లు స్లెడ్జింగ్‌లో కూడా తగ్గలేదు.
ఈ సిరీస్ ఎవరివైపు మొగ్గుతుందనే చివరి వరకూ సస్పెన్స్‌గానే కొనసాగింది. ప్రతి మ్యాచ్‌లో బోలెడు థ్రిల్ చోటు చేసుకుంది. లార్డ్స్ టెస్ట్ ఈ సిరీస్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్. మనం గెలవాల్సిన మ్యాచ్ అది. ఆ టెస్ట్‌లో మహమ్మద్ సిరాజ్ క్యారెక్టర్ మెమరబుల్. తను డిఫెన్స్ చేసిన బంతి అనూహ్యంగా వికెట్లు తాగి జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. సిరాజ్ ఆ మూమెంట్ జీవితంలో మర్చిపోలేడు.
ఆ రోజు నుంచి ఒక రివెంజ్ కోసం ఎదురుచూస్తున్న సిరాజ్‌కి చివరి టెస్ట్ రూపంలో అవకాశం వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ని పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సిరాజే హీరో. బ్రూక్ క్యాచ్ వదిలేసి.. ఒత్తిడి మొత్తం తన మీదకి తెచ్చుకున్నాడు. ఇక అంతే సంగతులు అనుకున్న సమయంలో మళ్లీ విజృంభించాడు. ఎక్కడలేని ఉత్సాహాన్ని పంజుకున్నాడు. అరిగిపోయిన పాత బాల్‌తో తను చేసిన స్వింగ్ అభిమానులు మర్చిపోరు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ చేతి నుంచి మ్యాచ్ లాగేశాడు.
అంతే కాదు, ఈ సిరీస్ మొత్తం సిరాజ్ చేసిన బౌలింగ్ మామూలుగా లేదు. బుమ్రా లేని బాధ్యతని తన భుజాన వేసుకున్నాడు. ఎన్ని ఓవర్లయినా వేయడానికి సిద్ధపడ్డాడు. చివరి వరకూ ఎనర్జీ కోల్పోలేదు. కీలక సమయాల్లో వికెట్లు అందించాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ కాంట్రిబ్యూషన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.