టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకొంటోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ఆర్.ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. అక్టోబరు 15న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈలోగా మిగిలిన తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. కథానాయికగా రవీనాఠాండన్ కుమార్తెని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ హీరోయిన్గా రవీనా కుమార్తెని తీసుకొందాం అనుకొన్నారు. అప్పట్లో ఫొటో షూట్ కూడా జరిగింది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఘట్టమనేని వారసుడితో ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన పాత్ర ఉంది. ప్రతినాయకుడిగా ఓ స్టార్ ని ఎంచుకోవాలని గట్టిగా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఈ పాత్ర.. కలక్షన్ కింగ్ మోహన్ బాబు దగ్గరకు వెళ్లి ఆగిందని తెలుస్తోంది. మోహన్ బాబుతో.. చిత్రబృందం చర్చలు నడిపింది. ఈ పాత్రలో నటించడానికి మోహన్ బాబు కూడా అంగీకరించారని సమాచారం. నిజంగానే మోహన్ బాబు ఎంట్రీ ఇస్తే.. ఈ ప్రాజెక్ట్ కి మరింత హైప్ వచ్చినట్టే. ఈ చిత్రం కోసం ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రేమకథే అయినా, యాక్షన్, గ్రామ కక్షలు లాంటి అంశాల్ని జోడించారని, క్లైమాక్స్ షాకింగ్ గా ఉండబోతోందని సమాచారం. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.