మోహన్ బాబుకు కష్టాలు తగ్గడం లేదు. 2019 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వలేదని ఇద్దరు కుమారులతో పాటు విద్యార్థులను తీసుకుని రోడ్డెక్కారు. అప్పట్లో ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న కేసులు నమోదయ్యాయి. వాటికి విచారణకు హాజరు కాకుండా ఉండాలని ఆయన అనుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింి.
ధర్నా జరిగినప్పుడు మీరు వ్యక్తిగతంగా అక్కడే ఉన్నారు కదా? అంటూ మోహన్‌బాబు తరపు న్యాయవాదిని విచారణ సందర్భంగా జస్టిస్ బేలా ప్రశ్నించారు. దానికి మోహన్ బాబు లాయర్ తన క్లయింట్ వయసు 75 సంవత్సరాలు అని చెప్పుకొచ్చారు. తాను ఒక ప్రైవేట్ వ్యక్తినని.. తనపై ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తించదని మోహన్‌బాబు తరపు న్యాయవాది వాదించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిర్వహించిన ధర్నా ఎలక్షన్ మోడల్ కోడ్ పరిధిలోకి రాదని, అయినా చార్జ్‌షీట్‌లో మోడల్ కోడ్ ఉల్లంఘన కేసు మోపారని వాదనలు వినిపించారు.
అయితే మోహన్ బాబు తరపు లాయర్ వాదనలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. తిరుపతిలో ధర్నా చేసిన తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీకి ప్రచారం చేశారు. తర్వాత వైసీపీకి దూరమయ్యారు. గతంలో ఈ కేసులో తిరుపతి కోర్టుకు హాజరైన తర్వాత తాను మోడీ మనిషినని చెప్పుకున్నారు.