నటుడు మంచు మోహన్ బాబుకు చెందిన మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులను ఫీజుల పేరుతో దోచుకున్నారని తేలడంతో గుర్తింపు రద్దు చేసి.. అందులో ఉన్న విద్యార్థుల బాధ్యతను ఎస్వీ యూనివర్శిటీకి అప్పగించాలని ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు చేసింది. ఈ వ్యవహారం గత ఏడాదిగా సాగుతున్నా బయటకు రాలేదు. ఇప్పుడు కమిషన్ విచారణ రిపోర్టును వెబ్ సైట్లో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్లి తాత్కలిక స్టే తెచ్చుకుంది ఎంబీయూ.
విద్యార్థులను దోచుకున్న మోహన్ బాబు యూనివర్శిటీ
యూనివర్శిటీలో విద్యార్థులను దోచుకుంటున్నారని మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ గతంలో ఆందోళన చేశారు. అది నిజమని ఇప్పుడు బయటపడింది. రెండేళ్ల కాలంలో మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి రూ.26 కోట్ల అదనంగా వసూలు చేశారని తేలింది. హాస్టల్స్ లో లేకపోయినా మెస్ చార్జీలు వసూలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేశారు. ఉన్నత విద్యా కమిషన్ విచారణలో ఇవన్నీ బట్టబయలు అయ్యాయి.
ఫీజులు విద్యార్థులకు తిరిగి ఇవ్వకుండా కోర్టుకు !
పలుమార్లు జరిగిన విచారణలో ఎంబీయూ కూడా అధిక ఫీజులు వసూలు చేసిన విషయాన్ని అంగీకరించింది. అయితే విద్యార్థులే స్వచ్చందంగా కట్టారన్న వింత వాదన వినిపించింది. చివరికి ఉన్నత విద్యా కమిషన్ .. ఎంబీయూ అక్రమ వసూళ్ళు నిజమేనని నిగ్గు తేల్చి రూ. 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ. 26 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఏపి ఉన్నత విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుందని సమాచారం. విద్యార్థుల బాధ్యతలను తాత్కలికంగా ఎస్వీయూకి అప్పగించాలని సూచించింది.
కోర్టుకెళ్లిన ఎంబీయూ
ఉన్నత విద్యా కమిషన్ నివేదిక, సిఫారసులపై మోహన్ బాబు యూనివర్శిటీ కోర్టులో పిటిషన్ వేసింది. ఉన్నత విద్యా కమిషన్ వేసిన జరిమానాను చెల్లించింది కానీ.. అక్రమంగా వసూలు చేసిన ఫీజులను చెల్లించలేదు. ఆ అంశంతో పాటు రిపోర్టును వెబ్ సైట్ లో పెట్టడంపైనా హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తాత్కలిక స్టే ఇచ్చింది . కానీ అధిక ఫీజులు వసూలు చేసినట్లుగా అంగీకరించడంతో పాటు.. నిబంధనలు ఉల్లంఘించినట్లుగా స్పష్టంగా ఉండటంతో.. యూనివర్శిటీ గుర్తింపు ఉండటం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
విద్యార్థుల దోపిడీ – ఎన్నో ఆరోపణలు</span<
మోహన్ బాబు యూనివర్శిటీలో విద్యార్థులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. మంచు మనోజ్ ఈ అంశంపై పోరాడారు. మోహన్ బాబుకు తెలియకుండా విద్యార్థుల వద్ద దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇదంతా కుటుంబ వివాదంలో భాగంగా జరుగుతోందని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఏడాది కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు ఉన్నత విద్యా కమిషన్ రిపోర్టును బయటపెట్టడంతో వెలుగులోకి వచ్చింది.