ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో అరెస్టులు జరుగుతున్నాయి. కింగ్ పిన్ లా వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తోడల్లుడు చాణక్యను అరెస్టు చేశారు. ఆయన ఏ8గా ఉన్నారు. లిక్కర్ స్కాంలో వీరంతా పాత్రధారులు. సూత్రధారులు ఎవరో అందరికీ తెలుసు. వారిపై అభియోగాలు మోపాలన్నా.. ప్రస్తుతం అరెస్టు చేస్తున్న వారిని బలంగా కేసులో ఉంచాలన్న మనీ ట్రయల్ ముఖ్యం. ఆ డబ్బుల్ని, ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కీలకం.
లిక్కర్ స్కాం నిధులు ఎవరెవరికి చేరాయో లెక్కలు తీసిన సీఐడీ
లిక్కర్ స్కాం ఎలా జరిగిందో.. డబ్బులు ఎవరెవరికి చేరాయో సీఐడీ ఇప్పటికే అన్ని వివరాలు రాబట్టింది. ఆధారాలతో సహా అన్ని అంశాలను రికార్డు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్క రూపాయిని స్వాధీనం చేసుకోలేదు. లిక్కర్ సొమ్ముతో వందల కోట్లు పెట్టి బంగారం కొన్నారు. అలాగే విదేశాలకు తరలించి అక్రమ పెట్టుబడులు రూపంలో వైట్ చేసి తిరిగి ఇండియాకు రప్పించారు. వీటన్నిటినీ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
భారతి సిమెంట్స్‌లోకి లిక్కర్ స్కాం సొమ్ము
లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ లింకులన్నీ తాడేపల్లి ప్యాలెస్‌లోనే కనిపిస్తున్నాయి. భారతి సిమెంట్స్ పూర్తి స్థాయి డైరక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ కి.. ప్రతి నెల .. అరవై కోట్ల రూపాయల నగదు అందేదని సీఐడీ అధికారులు గుర్తించారు. ఆయన అ డబ్బును భారతి సిమెంట్స్ పేరుతో వైట్ గా మార్చేసేవారని సీఐడీ గుర్తించింది. అంటే ప్రజల రక్తం పీల్చిన సొమ్ములో కొంత భాగం భారతి సిమెంట్స్ ద్వారా వైట్ లోకి వెళ్లాయన్నమాట.
ఈడీ రంగంలోకి దిగితేనే పూర్తి వివరాలు
లిక్కర్ స్కాంలో వేల కోట్లను నగదు రూపంలో వసూలు చేశారు. దాన్ని వైట్ గా చేసేందుకు హవాలాకు పాల్పడ్డారు. తమ కంపెనీల ద్వారా కొంత చెలామణికి తెచ్చారు. మరికొంత సొమ్ము విదేశాలకు తరలించి అక్కడ నుంచి రప్పించారు. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగితే.. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భారతి సిమెంట్స్ తో పాటు ఈ లిక్కర్ సొమ్మును వైట్ గా చేసిన పెద్దిరెడ్డి కంపెనీలకూ ఈడీ కేసులు చుట్టుకోవడం ఖాయమని అనుకోవచ్చు.