తెలంగాణ మద్యం దుకాణాలకు టెండర్లు ఎవరూ వేయడం లేదని అనుకున్నారు కానీ.. మద్యం వ్యాపారులు చాలా తెలివిగా ఉన్నారు. మొదట్లోనే వేయడం ఎందుకని.. చివరి తేదీల వరకూ ఎదురు చూశారు ఒక్క సారిగా ఎక్సైజ్ ఆఫీసుల ఎదుట క్యూ కట్టారు. చివరి రోజు అయిన శనివారం అర్థరాత్రి వరకూ ఎక్సైజ్ ఆఫీసులు పని చేశాయి. 83వేల మందికిపైగా టెండర్లు కొని రూ.3 లక్షలు కట్టారు. అయితే గడువు అయిపోయిన తర్వాత.. మరికొన్ని రోజులు గడువు పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పుడు 23 వ తేదీ వరకూ టెండర్లు దాఖలు చేయవచ్చు. 27వ తేదీన డ్రా తీస్తారు. ఇంకో పదిహేడు వేల దరఖాస్తులు వస్తే లక్ష మంది రూ. మూడు లక్షలు కట్టి టెండర్లు కొనుగోలు చేసినట్లే. ఇవి నాన్ రీఫండ్. అంటే మొత్తం మూడు వేల కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయితే ఇంకా ఎక్కువే రావొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బీసీ బంద్, పండుగల కారణంగా బ్యాంకులకు సెలవు కావడంతో ఎక్కువ మంది డీడీలు తీయలేకపోయామని చెప్పడంతో గడువు పొడిగించారు.
మద్యం దుకాణాలకు ఎంత రేటు పెట్టినా పోటీ పడేవారు ఉంటారు. ఈ సారి ఏపీ నుంచి కూడా మద్యం వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఏపీకి చెందిన ఓ మహిళ పేరుతో 150 దుకాణాలకు టెండర్లు దాఖలైనట్లుగా చెబుతున్నారు. ఇలా ఏపీ నుంచి కూడా చాలా మంది వ్యాపారాల కోసం తెలంగాణ మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. గతంలో ఏపీలో టెండర్లు దాఖలు చేసినప్పుడు తెలంగాణ వ్యాపారులు పోటీ పడ్డారు.