అందెశ్రీ పాడే మోశారని.. ఆయనను కన్నతండ్రిలా చూసుకున్నారని మోత్కుపల్లి నరసింహులకు సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రేమ వచ్చేసింది. అదే వేదికపై అదే రేవంత్ రెడ్డిని దళిత జన ఉద్దారకుడు అని పొగిడేేశారు మోత్కుపల్లి. అంతే కాదు ఎంత కాలం సీఎంగా ఉండాలనుకుంటున్నారో అంత కాలం ఉండాలని..తాము అండగా ఉంటామని కూడాచెప్పుకొచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్లే విపరీతంగా తిప్పుకుంటున్నారు.
మోత్కుపల్లి ఈ మధ్య కనిపించడం లేదు కాబట్టి ఆయన మాటలు కొత్తగా అనిపించవచ్చు కానీ.. రేవంత్ సీఎం అయ్యాక కూడా ఆయన చేసిన రచ్చ గుర్తున్న వారికి మాత్రం ఔరా అనిపిస్తుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు పోటీ చేసే అవకాశం లేదు. అసెంబ్లీలో రాలేదు.. ఎంపీగా కూడా రాలేదు. ఆ సమయంలోనే అయన రివర్స్అయ్యారు. మాదిగలకు లోక్సభ సీట్లు కేటాయించకపోవడంపై రేవంత్ అన్యాయం చేశారని.. ఎలా గెలుస్తారో చూస్తానని దీక్ష కూడా చేశారు. మాదిగలు కాంగ్రెస్కు ఓటు వేస్తే “నన్ను చంపినట్లే” అని హెచ్చరించారు.
గత ఏడాది జూలైలో నిరుద్యోగులకు రూ.5,000 భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టిని రేవంత్ “విస్మరిస్తున్నారు” అని ఆరోపించారు. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ మాట మార్చారు. గతంలో ఎన్టీఆర్ ను కూడా తిట్టిన రికార్డు ఆయనకు ఉంది. వైసీపీలో చేతులు కలిపి చంద్రబాబునూ తిట్టారు. తన నోటిని అదుపులో పెట్టుకోలేకపోవడంతో ఆయన రాజకీయంగా ఎవరికీ కాకుండా పోయారు.