ఒక్క సినిమాలు చాలు. కెరీర్ మారిపోవడానికి. ఒక్క శుక్రవారం చాలు… స్టార్లు పుట్టుకురావడానికి. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో చాలామంది జాతకాలు మారిపోయాయి. సంగీత దర్శకుడు బిజీ అయిపోయాడు. డైరెక్టర్ చుట్టూ నిర్మాతలు తిరుగుతున్నారు. హీరో మౌళి కూడా ఫుల్ బిజీ అయిపోతున్నాడు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు మౌళికి అడ్వాన్సులు ఇస్తున్నాయి. తాజాగా మైత్రీ మూవీస్ సంస్థ మౌళికి అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం. కోటి రూపాయల పారితోషికం ఇచ్చి మౌళితో అగ్రిమెంట్ చేయించుకొన్నార్ట. దర్శకుడు ఎవరో తెలీదు. జస్ట్… అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారంతే. తొలి సినిమా `లిటిల్ హార్ట్స్`తో మౌళి తీసుకొన్నది రూ.5 నుంచి రూ.10 లక్షల లోపే. రెండో సినిమాకి కోటి రూపాయల రేంజ్ కి వెళ్లిపోయాడు.
మైత్రీ ఒక్కటే కాదు… చాలామంది పెద్ద నిర్మాతలు మౌళితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. మౌళి కూడా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలందరి చుట్టూ ఓ రౌండ్ కొట్టాడు. కొంతమంది అడ్వాన్సులు కూడా ఇచ్చారు. వాటిలో మైత్రీదే పెద్ద మొత్తం. మైత్రీ ఎలాగూ కోటి ఫిక్స్ చేసింది కాబట్టి, ఇక నుంచి మౌళి పారితోషికం కోటి అనుకోవొచ్చు. ‘లిటిల్ హార్ట్స్’ తరవాత మౌళి చేయబోయే సినిమా ఏమిటన్నది ఇంకా ఖరారు కాలేదు. మైత్రీ గనుక కాస్త పేరున్న దర్శకుడ్ని తీసుకొస్తే, ఓ క్రేజీ కాంబో సెట్ చేస్తే.. మౌళి తదుపరి సినిమా మైత్రీలోనే ఉండొచ్చు.