సినిమా ఎప్పటికప్పుడు తన రూపు రేఖల్ని మార్చుకొంటోంది. కొత్త కొత్తగా ముస్తాబవుతుంటుంది. అది అవసరం కూడా. ఎందుకంటే.. మనకున్న కథలు కొన్నే. ఆ కథలనే కొత్తగా ఆవిష్కరించాలంటే కొత్త మార్గాల్ని అన్వేషించాల్సిందే. నవతరం దర్శకులు, హీరోలు కలిసి ఆ కొత్త బాట నిర్మించడానికి తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తున్నారు. అందుకే కొత్త జానర్లు పుట్టుకొస్తున్నాయి.
సినిమాకంటూ ఓ జోనర్ నిర్దిష్టంగా ఉంటుంది. హాలీవుడ్ సినిమాల్లో అది తేటతెల్లంగా కనిపిస్తుంటుంది. అక్కడ యాక్షన్ అంటే.. యాక్షనే. రొమాన్స్ అంటే రొమాన్సే. కానీ… తెలుగు సినిమా పరిస్థితి వేరు. ఇక్కడ సినిమాని జోనర్ పరంగా విడగొట్టలేం. ఏ సినిమా అయినా అన్ని హంగులూ ఉండాల్సిందే. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలో. అందులో యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్ని మిక్స్ చేయాలి. నిజానికి ఇది చాలా కష్టమైన ప్రక్రియ. కాబట్టే..హిట్లు చాలా అరుదుగా వస్తుంటాయి. కేవలం ఓ జోనర్‌కి కట్టుబడి ఉన్న సినిమాలు మంచి ఫలితాల్ని అందుకొంటాయన్న విషయం ఇప్పుడిప్పుడే మన కథకులకూ అర్థం అవుతోంది. దాంతో పాటు కొత్త జోనర్లని పుట్టించకపోతే మనుగడ కష్టం అనే నిజాన్ని తెలుసుకొంటున్నారు.
ఈమధ్య విడుదలైన కొన్ని సినిమాలు ముఖ్యంగా ‘యానిమల్’, ‘సలార్’, ‘మార్కో’, ‘హిట్ 3’ సినిమాల్ని పరిశీలిస్తే ఇవన్నీ యాక్షన్‌ని దట్టించిన సినిమాల్లానే అనిపిస్తాయి. అయితే కేవలం యాక్షన్ అయితే ఎలాంటి గుర్తింపూ దక్కకపోదును. ఆ యాక్షన్లోనూ కొత్త కోణం చూపించారు కాబట్టి నిలబడగలిగాయి. ముఖ్యంగా హింసనీ, రక్తపాతాన్ని చూపించిన విధానం చూసి యాక్షన్ ప్రియులు కూడా విస్తుపోయారు. రక్తపాతం విషయంలో పీక్స్ అన్నమాట. తలలు తెగిపడిపోవడం, చేతులు కాళ్లూ నరుక్కొంటూ వెళ్లడం, బుర్రలు బద్దలవ్వడం, పేగులు సైతం బయటకు వచ్చేయడం.. ఇలా తెరపై చాలా చాలా హింస ధారాళంగా సాగింది. ఇది వరకటి జమానా అయితే ప్రేక్షకులు సినిమా సగం మధ్యలోనే వదిలేసి, థియేటర్లకు పరుగులు పెట్టేవారు. కానీ ఇప్పటి ప్రేక్షకుల అభిరుచి మారింది. వాళ్లు ఈ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. ఆ బ్లడ్ బాత్‌లో నిండా మునిగారు. కలక్షన్లతో సినిమాల్ని ముంచెత్తారు.
ఈ ఊపుతో రానున్న రోజుల్లో మరిన్ని హింసాత్మక సినిమాలు రావడం ఖాయం. పెద్ద హీరోలూ ఇలాంటి యాక్షన్ సినిమాలు చేయడానికి మక్కువ చూపించడం సహజం. చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ సినిమా రానుంది. ఇది పూర్తిగా రక్తపాతంతో నిండిన సినిమా అని ప్రీ లుక్ తోనే చెప్పేసింది చిత్రబృందం. నాని `పారడైజ్` ఇందుకు అతీతం ఏమాత్రం కాదు. పైగా ‘హిట్ 3’తో నానికి మరింత ఊపు వచ్చింది. ఈసారి యాక్షన్ మరింత దట్టిస్తారు. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కే `స్పిరిట్`లోనూ రక్తం సముద్రంలా పోటెత్తడం మనం చూడబోతున్నాం. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఇదే దారిలో రూపుదిద్దుకోనుంది. త్వరలో రాబోతున్న సినిమాల్లో ‘కింగ్డమ్’ ఇందుకు మరో తాజా ఉదాహరణగా నిలవబోతోంది. ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటార్ట. ఆ స్థాయిలో వాటి డిజైనింగ్ ఉండబోతోంది.
హింస పక్కన పెడితే… సినిమాల్లో బూతులకు మరింత గట్టిగా వినిపించబోతున్నాయి. ఇది వరకు బూతులు నెగిటీవ్ క్యారెక్టర్లే మాట్లాడేవి. ఇప్పుడు హీరోలూ అందుకొంటున్నారు. అదో కమర్షియల్ యాంగిల్ అయిపోయింది. సున్నితమైన విషయాలు, చర్చించకూడని సంగతులు కూడా తెరపైకి తీసుకురావడం నేటి ట్రెండ్. దాన్ని `యానిమల్`లో సందీప్ రెడ్డి 70 ఎం.ఎంలో చూపించాడు. ఆ తరవాత చాలామంది దాన్ని ఫాలో అయ్యారు. భవిష్యత్తులో ఈ ట్రెండ్ మరింత ఉధృతంగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. సెన్సార్ కత్తెర్లు ఇప్పుడు కాస్త పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీప్ సౌండ్ లు వినిపించకుండా తమ డైలాగుల్ని ఎలా పాస్ చేయించుకోవాలన్నది దర్శకుడి తెలివితేటలపై ఆధారడి ఉన్న అంశం.
కొన్ని సినిమాలు హిట్ అవ్వడం పరిశ్రమకు చాలా అవసరం. కొన్ని హిట్ అయితే ప్రమాదం. అలానే హింసా ప్రవృర్తి పెరిగిపోయే ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించడం, పరోక్షంగా హింసకు వత్తాసు పలకడమే అని కొంతమంది వాదిస్తారు. కాకపోతే ఇప్పటి ప్రేక్షకుల్లో సున్నితత్వం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. కొన్ని విషయాల్ని స్ట్రాంగ్ డోస్ తో చెబితే కానీ ఎక్కడం లేదు. అందుకే సినిమా రూపకర్తలు ఆ డోసు పెంచాలని చూస్తున్నారు. చూస్తున్నారు కదా అని హింసని మరీ వికృతకంగా చూపిస్తే.. వెగటు పుట్టే ప్రమాదం ఉంది. కాబట్టి బ్యాలెన్స్ చేసుకొనే విద్య దర్శకులకు తెలిసుండాలి. లేదంటే… ఈ జోనర్ ని కూడా ప్రేక్షకులు తిప్పి కొట్టడానికి సిద్ధంగానే ఉంటారు.