బుట్టా రేణుకను నమ్మి జగన్ అవకాశం కల్పిస్తారా..?

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీలో ఆశించిన ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌లో ఏదీ రాకపోవడంతో ఆమె తిరిగి వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు ఆమెతో చర్చలు జరిపారు. టిక్కెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో.. ఆ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. 2014లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టా రేణుక గెలిచారు. గెలిచిన రెండు నెలలకే.. ఆమె టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆగిపోయారు. కానీ ఆమె భర్త మాత్రం కండువా కప్పించుకున్నారు. అప్పట్లోనే ఆమెకు… హైదరాబాద్‌లో ఉన్న మెరీడియన్ స్కూల్స్ వ్యవహారం వివాదాస్పదం అయ్యాయి. పార్టీ మారకపోవడంతో.. సర్దుకుకున్నారు. మళ్లీ 2017 అక్టోబరులో అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి టీడీపీకి మద్దతు ప్రకటించారు.

అయితే ఈ ఏడాది జనవరి 19న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబం సీఎం చంద్రబాబును కలవడంతో బుట్టా రేణుక అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమైంది. అంతకు ముందు లోకేష్ కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆమెకు టిక్కెట్ ప్రకటించారు. కానీ కోట్ల చేరికతో అంతా తారుమారైంది. ఎంపీ టికెట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కోట్లకే కేటాయిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. కర్నూలు ఎంపీ టికెట్‌ కోట్లకు ఖరారు చేయడంతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్‌ను బుట్టా రేణుక ఆశించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి స్పష్టత ఇవ్వడంతో ఆదోని అసెంబ్లీ స్థానం టికెట్‌ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. ఆదోని నుంచే ఆమె పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆదోని టికెట్‌ మీనాక్షినాయుడుకి ఇచ్చారు.

ఇప్పుడు వైసీపీ నేతలు.. ఆమెకు కర్నూలు లోక్‌సభ స్థానం లేదా ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం కానీ ఇస్తామని చెబుతున్నారు. అయితే… గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే పార్టీ మారే ప్రయత్నం చేసిన బుట్టా రేణుకను.. జగన్ నమ్మరని.. పార్టీలో చేర్చుకుంటారు కానీ.. టిక్కెట్ ఇవ్వరని… ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com